ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరిన చంద్రబాబు ఘన విజయం సాధించారు. ఆ తర్వాత జరుగుతున్న పలు రాష్ట్రాల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్డీఏ తరఫున ప్రచారం చేస్తున్నారు. గతంలో ఢిల్లీ, మహారాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేయాల్సివుండగా, వ్యక్తిగత కారణాల వల్ల మహారాష్ట్రలో ప్రచారం చివరి నిమిషంలో రద్దైంది. ఇక బిహార్ వెళ్లనున్నట్లు చంద్రబాబు స్వయంగా ప్రకటించడంతో ఆయన షెడ్యూల్ పై ఆసక్తి నెలకొంది.
గత మూడు రోజుల నుంచి దుబాయ్ తోపాటు అరబ్ దేశాల్లో పర్యటించిన చంద్రబాబు శనివారం స్వదేశానికి చేరుకుంటారు. మళ్లీ వచ్చేవారం అంటే నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు బ్రిటన్ లో పర్యటిస్తారు. నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే సీఐఐ సదస్సు కోసం పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గంలోని ఎంపిక చేసిన నేతలు విదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు బిహార్ పర్యటన ఉంటుందని ఆయనే స్వయంగా ప్రకటించడం విశేషంగా చెబుతున్నారు. బిజీ షెడ్యూల్ నడుమ చంద్రబాబు బిహార్ ఎప్పుడు వెళ్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
బిహార్ లో వచ్చే నెలలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. 6వ తేదీన తొలివిడత ఎన్నికలు జరగనుండగా, 11న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. బిహార్ లో కచ్చితంగా ఎన్డీఏ గెలుస్తుందని చంద్రబాబు ఎక్కడెక్కడ పర్యటిస్తారనేది తెలియాల్సివుంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో చంద్రబాబుకు ముందు నుంచి సాన్నిహిత్యం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏలో ఈ ఇద్దరు క్రియాశీలంగా ఉన్నారు. బిహార్ లో నితీశ్ నేతృత్వంలోని ప్రభుత్వం మరోసారి గెలిస్తే అది ప్రధాని మోదీ పాలనకు మరింత శక్తినిస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. దీంతో తానే స్వయంగా చొరవ తీసుకుని ప్రచారం చేస్తానని చెప్పడం విశేషమంటున్నారు.
గతంలో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేసిన చంద్రబాబు.. బీజేపీ విజయంలో పాలుపంచుకున్నారని, ఇప్పుడు బిహార్ లో కూడా అదే జోష్ చూపాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. బిహార్ లో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం తెలుగు ఎక్కువగా మాట్లాడేవారు బిహార్ లో తక్కువే అయినప్పటికీ, ఇక్కడి నుంచి దశాబ్దాల క్రితమే బిహార్ వెళ్లి అక్కడ పారిశ్రామిక వాడల్లో జీవిస్తున్నవారు గణనీయంగా ఉన్నట్లు అనధికార సమాచారం. అదే సమయంలో బిహార్ నుంచి ఎక్కువ మంది వలస కార్మికులు ఏపీ, తెలంగాణకు వస్తుంటారు. దీంతో చంద్రబాబు ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు చంద్రబాబుతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రచారంపైనా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాదిలో బీజేపీ తరఫున ఉధృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పవన్ ఉత్తర భారతంలో కూడా అడుగుపెడతారా? అనే ఆసక్తి కనిపిస్తోంది. ఏదిఏమైనా చంద్రబాబు బిహార్ పర్యటన రాజకీయంగా ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.
















