ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. సియోల్ నుంచి రైలుమార్గంలో ప్రముఖ వాణిజ్య నగరమైన బుసాన్ చేరుకున్న మంత్రి, అక్కడ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఎగుమతుల పెరుగుదల, ఆధునిక తయారీ రంగాల అభివృద్ధి లక్ష్యంగా ఆయన విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.
బుసాన్‌లో పాదరక్షలు, షూ లేసులు, మెటల్ హార్డ్‌వేర్, అనుబంధ ఉత్పత్తుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బూ యంగ్ గ్రూప్ (Boo Young Group) సీఈవో & ప్రెసిడెంట్ డైరెక్టర్ ర్యాన్ కాంగ్, బిజినెస్ స్ట్రాటజీ & ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్‌సన్తో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక ఫుట్‌వేర్ తయారీ యూనిట్‌తో పాటు అనుబంధ విడిభాగాల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించారు.
ఏపీలో అందుబాటులో ఉన్న భూమి, పోర్టుల అనుసంధానం, పారిశ్రామిక విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ, పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వివరించారు. భారీ పెట్టుబడులు వస్తే వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
దక్షిణ కొరియాలో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యక్ష అనుసంధానం కల్పించే లక్ష్యంతో ఏపీఈడీబీ (APEDB) ఆధ్వర్యంలో “APEX – Korea (Andhra Pradesh External Engagement – Korea)” పేరుతో ప్రత్యేక Investor Facilitation and Outreach Cellను బుసాన్‌లో మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా కొరియా కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులపై పూర్తి సమాచారం, ప్రభుత్వ విధానాలు, అనుమతులు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయాన్ని అందించనున్నారు.
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా హ్యుందాయ్ మొబిస్, అపాక్ట్, శాంసంగ్ వంటి ప్రముఖ సంస్థల ఉన్నత ప్రతినిధులతో కూడా మంత్రి సమావేశమయ్యారు. ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సెమీకండక్టర్లు, హైటెక్ తయారీ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, భారత తూర్పు తీరంలో సముద్ర వాణిజ్యానికి అత్యంత అనుకూలమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని తెలిపారు. రాష్ట్రానికి 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, ఒక మేజర్ పోర్టు, ఐదు నాన్-మేజర్ ఆపరేషనల్ పోర్టుల ద్వారా ప్రతి సంవత్సరం 330 మిలియన్ టన్నులకు పైగా సరుకుల రవాణా జరుగుతోందని వివరించారు. ఈ మౌలిక సదుపాయాలు ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు ఎంతో అనుకూలమని పేర్కొన్నారు.
Korea Marine Equipment Association (KOMEA) ఆధ్వర్యంలో బుసాన్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి, మెరైన్ పరికరాల తయారీ, షిప్‌బిల్డింగ్, పోర్టు మౌలిక సదుపాయాలు, సముద్ర వాణిజ్య అభివృద్ధిపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ను సముద్ర ఆధారిత పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని చెప్పారు.
అంతేకాకుండా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ హ్వాసంగ్ గ్రూప్ (Hwaseung Group) ఉన్నతస్థాయి ప్రతినిధులతో కూడా మంత్రి సమావేశమయ్యారు. ఫుట్‌వేర్, స్పోర్ట్స్ మెటీరియల్స్, ఆటోమోటివ్ కాంపొనెంట్స్, ODM స్పోర్ట్స్ ఫ్యాషన్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ఈ సంస్థ ఇప్పటికే కుప్పంలో ఫుట్‌వేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడాన్ని మంత్రి స్వాగతించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో భారీ ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
బుసాన్‌లోని అత్యాధునిక Shoealls స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ తయారీ కేంద్రాన్ని కూడా మంత్రి సందర్శించారు. మెడికల్ మాగ్నెటిక్ జనరేటర్లు, స్మార్ట్ చిప్ టెక్నాలజీ, వైబ్రేషన్ ఆధారిత ఫుట్‌వేర్ తయారీ విధానాన్ని పరిశీలించారు. రక్త ప్రసరణ మెరుగుపరచడం, కండరాల అలసట తగ్గించడం, నడకను సౌకర్యవంతంగా మార్చడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను అందించే సాంకేతికతపై ఆసక్తి కనబరిచారు.
ఇలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని హైటెక్ తయారీ రంగంలో ముందంజలో నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా ఫుట్‌వేర్, మెడికల్ డివైసెస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, మెరైన్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ పర్యటన ద్వారా దక్షిణ కొరియా కంపెనీలతో ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పారిశ్రామిక భాగస్వామ్యం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు పెరగడం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగవంతం కావడంతో పాటు యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


















