నారా లోకేష్ ఏపీ విద్యా మంత్రి. దానికంటే ముందు ఉన్నత విద్యావంతుడు. విదేశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. మరి లోకేష్ కి దేశంలోని విషయాల మీద కనీస అవగాహన లేదా అని నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే ఒక జాతీయ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారా లోకేష్ మాట్లాడుతూ హిందీని జాతీయ భాషగా చెప్పడం. యాంకర్ ఆయన తప్పుని సవరిస్తూ హిందీ జాతీయ భాష కాదని చెప్పాల్సి వచ్చింది.
దీంతో నారా లోకేష్ ఈ రోజుకీ హిందీని జాతీయ భాషగా అనుకుంటున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది. నిజానికి చూస్తే ఈ దేశంలో జాతీయ భాష అంటూ ఏదీ లేదు. రెండు అధికారిక భాషలు మాత్రం ఉన్నాయి. అవి ఒకటి హిందీ అయితే మరొకటి ఇంగ్లీష్. ఈ రెండూ అధికారిక భాషలుగా రాజ్యాంగం గుర్తించింది.
అధికారిక భాషగానే హిందీని అంతా చూస్తారు. అందువల్ల హిందీ భాష వినియోగం దేశమంతా ఉండాలన్న నిబంధన అయితే లేదు. అదే సమయంలో జాతీయ భాషగా హిందీని గుర్తించాలని ఒక పక్క డిమాండ్లు అయితే ఉన్నాయి. అదే సమయంలో మా భాషలు కూడా ప్రాచీనమైనవి కాబట్టి వాటిని కూడా జాతీయ భాషలుగా గుర్తించాలని పలు ప్రాంతీయ భాషలు డిమాండ్ పెడుతూండడంతో అది అక్కడితో ఆగింది.
ఇక జాతీయ భాష అంటే దానిని దేశమంతా వినియోగిస్తారు. ఈ విషయంలో ఎలాంటి ఆప్షన్లు ఉండవు. అలా కాదు కాబట్టే హిందీని మేము మాట్లాడమని తమిళనాడు వంటి రాష్ట్రాలు చెబుతున్నా అది వారి ఆప్షన్ గానే చూస్తున్నారు. మరి ఈ విషయం విద్యా మంత్రిగా ఉన్న లోకేష్ కి తెలియదా అని నెటిజన్లు అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక జాతీయ భాష గా హిందీని ఎందుకు ముందుకు తీసుకుని వెళ్ళకూడదు, హిందీని ఎందుకు నేర్చుకోకూడదు ని నారా లోకేష్ ఆ చానల్ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తున్నారు.
అయితే యాంకర్ చెప్పిన తరువాత సర్దుకున్న లోకేష్ ఇంగ్లీష్ లాగానే హిందీ కూడా లింక్ లాంగ్వేజ్ అని అన్నారు. మొత్తం మీద చూస్తే హిందీని అధికార భాషగానే అంతా చూస్తూంటే జాతీయ భాష అని రాజ భాష అని ఏపీలోని ప్రముఖులు మాట్లాడం మీద చర్చ సాగుతోంది. సెటైర్లు కూడా పడుతున్నాయి.
అసలు ఈ భాషా వివాదం ఎందుకు వస్తోంది అన్నది కూడా మరో చర్చగా ఉంది. బీజేపీ మద్దతుగా ఉంటూ ఎన్డీయేలో ఉన్న ఇతర మిత్రులు ఎవరూ హిందీ గురించి ఈ విధంగా చెప్పడం లేదు అంతవరకూ ఎందుకు ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న కర్ణాటకలోని జేడీఎస్ అక్కడ హిందీని వద్దు అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం లేదు. ఏపీలో మాత్రం పోటాపోటీగా మద్దతు ప్రకటిస్తున్నారు అని అంటున్నారు. ఇది రాజకీయం కోసమా లేక హిందీ మీద నిజమైన అభిమానమా అన్న విమర్శలూ వస్తున్నాయి.