తెలుగు దేశం పార్టీలో ఒక విధంగా ఇది కొత్త విషయంగానే చూడాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుంచి చూస్తే కనుక ఆ పార్టీలో ఘనత ఏది అయినా అధినాయకత్వానికి కట్టబెట్టడం ఇక అనవాయితీగా వస్తూ ఉంది. ఇక ఎన్టీఆర్ పార్టీ ప్రెసిడెంట్ గా సీఎం గా ఉన్న సమయంలో కూడా ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబుకు క్రెడిట్ కి బాగానే దక్కుతూ వచ్చేది. ఇక 1995లో టీడీపీని చంద్రబాబు నాయకత్వంలోకి తెచ్చుకున్నాక గడచిన ముప్పయ్యేళ్ళ కాలంలో టీడీపీలో ఏమి మంచి జరిగినా ఏ విజయం దక్కినా అంతా బాబు అనే పరిస్థితి. బాబు చుట్టే పార్టీ పరిభ్రమిస్తూ వస్తోంది. అయితే ఇపుడు సీన్ మారుతోంది. తెలుగుదేశం పార్టీలో మరో నాయకత్వం ముందుకు వస్తోంది. నారా లోకేష్ యువ నాయకత్వం టీడీపీని నడిపిస్తోంది. చంద్రబాబు ఆశీస్సులతో నారా లోకేష్ తనదైన రాజకీయంతో ముందుకు సాగుతున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏపీకి పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడానికి లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారు అని మెచ్చుకున్నారు. లోకేష్ వల్లనే ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని కూడా అన్నారు. లోకేష్ మార్గదర్శకత్వంలో ఎమ్మెల్యేలలో కదలిక బాగా వచ్చిందని చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రజా దర్బార్ లోకేష్ నిర్వహిస్తూ వస్తున్నారని అది ఎమ్మెల్యేలకు కూడా స్పూర్తిగా మారిందని బాబు అంటున్నారు. మొత్తం గా చూస్తూంటే ప్రభుత్వం పార్టీలో లోకేష్ ప్రభావం బాగా ఉందని చంద్రబాబు గట్టిగానే చెబుతున్నారు అని భావించాలి.
ఇక ఏపీ సీఎం చంద్రబాబు విషయం చూస్తే గతంలో అన్ని విషయాలు ఆయన ఒక్కరే చూసుకునే వారు. ఆయన ఒక్కరే బాధ్యత మోసేవారు. అయితే ఇపుడు అలా కాదు లోకేష్ సగానికి పైగా భారం మోస్తున్నారు. తాజాగా బీహార్ ఎన్నికల ప్రచారానికి నారా లోకేష్ వెళ్ళడం ఒక ఆసక్తికరమైన పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీకి చెందిన మిత్ర పక్షం కీలకంగా ఉన్న తెలుగుదేశం నుంచి చంద్రబాబు బదులుగా లోకేష్ వెళ్తున్నారు అంటే అది ఎన్డీయేలో కూడా ఆయన ప్రాధాన్యతను బాగా పెంచుతోంది అనే అంటున్నారు. నిజానికి బీహార్ ఎన్నికలు ఎన్డీయేకు చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ ఎన్నికల్లో కనుక విజయం సాధిస్తే లోకేష్ గ్రాఫ్ కూడా నేషనల్ వైడ్ బాగా పెరుగుతుంది అన్నది వాస్తవం. అంతే కాదు ఎన్డీయే కేంద్ర పెద్దల వద్ద ఆయన పలుకుబడి మరింతగా పెరిగే చాన్స్ ఉంది అని అంటున్నారు.
లోకేష్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఆయన తరచు ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను కలుస్తున్నారు వారు కూడా యువ నేతగా లోకేష్ ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో వస్తున్న మార్పులు లోకేష్ కి పెరుగుతున్న ప్రాధాన్యత వంటివి కేంద్ర పెద్దలు కూడా గమనిస్తున్నారు అని అంటున్నారు. అలా గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీలో లోకేష్ ప్రభావాన్ని పెంచుతూ అదే సమయంలో ఢిల్లీ స్థాయిలో కూడా లోకేష్ పరపతిని పెంచుతున్న తీరుని చూసిన వారు అంతా టీడీపీలో ఇవన్నీ నూతన పరిణామాలు అని అంటున్నారు. తెలుగుదేశంలో చంద్రబాబు వన్ అండ్ ఓన్లీ నుంచి ఆయన క్రెడిట్స్ ని షేర్ చేసుకోవడం అంటే పార్టీలో రానున్న కాలంలో ఏమి జరగబోతోంది అన్నది కూడా ఒక అంచనాకు వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయా అన్నదే చర్చగా ఉంది మరి.


















