భార్యల్ని చంపే భర్తల రోజులు పోయి.. భర్తల్ని ఏసేసే భార్యల ట్రెండ్ కొంతకాలంగా నడుస్తూ వస్తోంది. తమకున్న వివాహేతర సంబంధాలకు అడ్డు రాకూడదనో.. మొగుడ్ని వదిలించుకోవటానికి..కొత్త బంధాలకు బంధీగా మారిన భార్యలు సదరు వ్యక్తితో కలిసి భర్తల్ని హత్యలు చేసే ప్లాన్ చేయటం తెలిసిందే. ఇప్పుడు చెప్పే ఉదంతం ఇదే కోవకు చెందినదే అయినా.. ఎలాంటి వివాహేతర సంబంధం లేనప్పటికి.. కేవలం ఇంట్లో తరచూ భర్తతో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అతడ్నివదిలించుకునేందుకు మర్డర్ ప్లాన్ చేసిన మైసూర్ భార్య ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
మైసూర్ లోని సంజనగూడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే సంగీతకు కొన్నేళ్ల క్రితం ఫైబర్ డోర్స్ బిగించే రాజేంద్ర అనే వ్యక్తితో వివాహమైంది.అయితే.. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె భర్తను అడ్డు తొలగించే దుర్మార్గమైన ప్లాన్ వేసింది. దీనికి సంగీత సొంత సోదరుడు తోడై.. ఎవరికీ అనుమానం కలగకుండా బావను చంపేసేందుకు ముదురు ప్లాన్ వేశారు.
ఈ దారుణ ఘటనకు ఒక మైనర్ ను కూడా వాడుకున్న వైనం చూస్తే.. వారి తెగింపు ఎంతలా ఉందన్నది అర్థమవుతుంది. తాము వేసుకున్న ప్లాన్ ను వర్కువుట్ చేసుకునేందుకు వీలుగా ఈనెల 25న సాయంత్రం వేళలో బయటకు వెళదామని భర్తను కోరింది సంగీత. అందుకు ఓకే చెప్పిన రాజేంద్ర.. ఆమెను తీసుకొని తన టూవీలర్ మీద హుండువినహళ్లి లేఅవుట్ పరిధిలోని ముడా లేఅవుట్ వద్దకు వెళుతున్నారు.
వారికి ఎదురుగా ఒక వైట్ కలర్ కారు వచ్చి ఆగింది. ఆ కారు పక్క నుంచి వెళ్లేందుకు దారి లేకపోవటంతో తన టూవీలర్ ను ఆపేశాడు రాజేంద్ర. ఇంతలో కారులో నుంచి ఇద్దరు కిందకు దిగారు. కారులోనే బావ సంజయ్ కూర్చొని ఉన్నాడు. బయటకు వచ్చిన ఇద్దరు వచ్చీ రాగానే.. టూవీలర్ ను పక్కకు తోసేశారు. దీంతో భార్యభర్తలు ఇద్దరు ఒకపక్కకు పడిపోయారు. సంగీత మెడలో ఉన్న బంగారు గొలుసును మైనర బాలుడు తెంపేసే ప్రయత్నం చేయగా.. అడ్డుకునే ప్రయత్నంచేసిన రాజేంద్ర కడుపులో మరో నిందితుడు కత్తితో పొడిచేశాడు.
తనపైదాడి చేస్తున్న వేళ.. రాజేంద్ర పెద్దగా కేకలు వేయటంతో అటుగా వెళుతున్న వాహనాలు ఆగటంతో నిందితులు రాజేంద్రను వదిలేసి పరారయ్యారు. గాయాలతో ఉన్న రాజేంద్రను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఫిర్యాదు తీసుకొని విచారణ చేపట్టారు. సీసీ కెమేరా ఫుటేజ్ సాయంతో నిందితులు ఉపయోగించిన కారును గుర్తించారు.దాన్ని అద్దెకు తీసుకున్నట్లుగా తేల్చారు. తమ దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడ్ని గుర్తించారు. మైనర్ బాలుడ్ని జువైనల్ హోంకు పంపగా.. భార్యను, ఆమె సోదరుడ్ని.. అతడి స్నేహితుడ్ని రిమాండ్ కు పంపారు. విచారణలో మొత్తం విషయం బయటపడటంతో పోలీసులు సైతం అవాక్కైన పరిస్థితి.
 
			



















