రాష్ట్రంలో మూడు మెగా సిటీలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మాదిరిగానే విశాఖ, తిరుపతిలను కూడా మెగాసిటీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మెగాసిటీల ద్వారా పారిశ్రామిక ప్రగతి సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు నమ్ముతున్నారు. శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఆమోదించారు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మెగాసిటీల ఏర్పాటు ఆలోచనను పంచుకున్నారు.
ప్రస్తుతం అమరావతి మెగా సిటీగా నిర్మాణం అవుతున్నందున, అధికారులు విశాఖ, తిరుపతిపై దృష్టిపెట్టాలని సూచించారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖ మెగా సిటీ తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ మెగా సిటీలను టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. టూరిజం, ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ సమన్వయంతో మూడు మెగా సిటీల అభివృద్ధికి ప్రణాళిక రచించాలని సూచించారు. ఈ మూడు నగరాలను నివాసయోగ్యమైన నగరాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖకు మరిన్ని కంపెనీలు, పరిశ్రమలు రానున్నాయని సీఎం వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో మూడు ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు అవుతున్నాయని, వీటికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకోవాల్సి ఉందని సీఎం సూచించారు. మూడు కారిడార్లకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతోపాటు ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములు, విద్యుత్ లభ్యత కూడా ఉండేలా చూడాలని సీఎం సూచించారు. 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పాల్గొన్న సీఎం రాష్ట్రంలో 26 కొత్త పరిశ్రమల ప్రతిపాదనల్ని ఆమోదించారు. వీటి ద్వారా రూ. 1,01,899 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 85,570 ఉద్యోగాలు దక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన 16 నెలల్లో జరిగిన 12 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా మొత్తంగా రూ. 8,08,899 కోట్ల పెట్టుబడులు, 7,05,870 ఉద్యోగాలు రానున్నాయి.
















