ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుకూల మీడియాకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం మరో మలుపు తిరిగింది. జగన్ కుటుంబ యాజమాన్యంలోని సాక్షి పత్రిక, సాక్షి మీడియా చానల్ పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 10, 14వ తేదీల్లో సాక్షి పత్రిక, టీవీల్లో తన పరువుకు నష్టం కలిగేలా కథనాలు ప్రసారం చేశారని బీఆర్ నాయుడు ఆరోపించారు. తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేదంటే, టీటీడీకి రూ.10 కోట్లు చెల్లించాలని టీటీడీ చైర్మన్ నోటీసులు పంపారు. దీంతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సాక్షి మీడియాతో యుద్ధానికి సిద్ధమయ్యారని అంటున్నారు.
అయితే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పంపిన నోటీసులకు భయపడేది లేదని సాక్షి యాజమాన్యం ప్రకటించింది. ‘ఉడత ఊపులకు తాము భయపడం’ అని చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హయాంలో టీటీడీలో అరాచకాలు పెరిగిపోతున్నాయని పునరుద్ఘాటించింది. టీటీీని రాజకీయాలకు అతీతంగా ఉంచాలన్నదే తమ ప్రయత్నమని, సామాన్యుల భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి పోరాడుతామని ప్రకటించింది. దీంతో ఇరువర్గాలు తగ్గేదేలా అన్నట్లు వ్యవహరించడంతో ఈ వివాదం ఎంతవరకు వెళుతుందనే ఉత్కంఠ ఎక్కువవుతోంది.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు టీవీ 5 చైర్మన్ గాను వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన చైర్మనుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీలో పలు సంఘటనలు చోటుచేసుకున్నాయని సాక్షి కథనాలు రాస్తోంది. అయితే ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలకు తాను బాధ్యత వహించానని వివరణ ఇస్తున్న చైర్మన్ బీఆర్ నాయుడు సాక్షి తమ పై పత్రిక, టీవీ చానల్ లో ఉద్దేశపూర్వకంగా తన పరువుకు నష్టం కలిగేలా చేస్తున్నారని మండిపడుతున్నారు. గతంలో కూడా టీవీ5 పై విషం చిమ్మే ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. సాక్షి మీడియాను కట్టడి చేసేందుకు న్యాయపోరాటం చేయాలని చైర్మన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
ఇక పరువు నష్టం దావా వేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన ప్రత్యర్థి చానల్ సాక్షి ప్రసారాలు నిలిపివేయాలని కోరుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖను కోరతానంటూ ప్రకటించడం కూడా విశేషం. స్వతహాగా ఓ మీడియా చానల్ కు అధిపతి అయిన బీఆర్ నాయుడు మరో చానల్ అనుమతి రద్దు చేయాలని కోరడం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. దీంతో అధికార, విపక్షాల మధ్య జరిగే రాజకీయ యుద్ధం.. మీడియా వార్ గా మారిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా సాక్షి, వైసీపీ నేతలపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని టీవీ5 యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇప్పుడు టీటీడీ తరుఫున నోటీసులు జారీ చేయడం, తన మీడియాను చూసి ఓర్వలేకే సాక్షి తప్పుడు కథనాలు రాస్తుందని చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పడంతో రెండు మీడియా సంస్థల మధ్య ఆధిపత్య పోరులో టీటీడీని మధ్యలోకి లాగారని అంటున్నారు.