ఏడాది క్రితం ఏపీ రాజకీయాలను కుదిపేసిన తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. అప్పట్లో సృష్టించిన దుమారం ఒక్కసారిగా చల్లబడినా, ఇప్పుడు మళ్లీ దర్యాప్తు దిశలో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తు వేగం పెంచింది. తాజాగా టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పర్సనల్ అసిస్టెంట్ అప్పన్నను అరెస్ట్ చేయడం కేసుకు కొత్త ఉత్కంఠను జోడించింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించినందున ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది. దేవాలయ ప్రసాదం నాణ్యతపై వచ్చిన ఆరోపణలు ప్రజల విశ్వాసాన్నే కదిలించాయి. గత ఏడాది జూలైలో మొదలైన ఈ కేసులో ఇప్పటికే 15 మందిని సిట్ అరెస్ట్ చేసింది. వారిలో డెయిరీ యజమానులు, టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాలకు దగ్గరైన వ్యక్తి అరెస్ట్ కావడంతో దర్యాప్తు మరింత సీరియస్ మోడ్‌లోకి వెళ్లింది.
సిట్ ఆధారాలు ప్రకారం లడ్డూల తయారీలో వాడిన నెయ్యి పూర్తిగా నాణ్యత లేనిదని నిర్ధారణ అయింది. ఉత్తరాఖండ్ కేంద్రంగా ఉన్న భోలే బాబా డెయిరీ నుంచి సరఫరా అయిన ఈ నెయ్యిని టీటీడీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టినా, అదే సంస్థ మళ్లీ వేరే పేరుతో సరఫరా చేసిందని దర్యాప్తులో బయటపడింది. ఈ వ్యవహారంలో కొంతమంది టీటీడీ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది.
అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహారాలపై కూడా సిట్ దృష్టి పెట్టింది. వారి అనుమతుల ద్వారానే కాంట్రాక్టులు ఇవ్వబడ్డాయా అన్న కోణంలో విచారణ జరుగుతోందట. అప్పన్న అరెస్ట్‌తో ఇప్పుడు దృష్టి పూర్తిగా పెద్దలవైపుకి మళ్లింది. త్వరలో వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి 2024 వరకు వైవీ సుబ్బారెడ్డికి పీఏగా ఉన్న అప్పన్న.. ఢిల్లీలో టీటీడీ సంబంధిత వ్యవహారాలను సమన్వయం చేసేవాడట. జగన్ ప్రభుత్వంలో హస్తినలోని ఏపీ భవన్‌లో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించాడన్న సమాచారం ఉంది. సిట్ ఈ అంశాలన్నింటినీ క్రాస్ చెక్ చేస్తోంది. ఇప్పటివరకు దర్యాప్తు కేవలం డెయిరీల స్థాయిలో మాత్రమే సాగిందని భావించిన అధికారులు, ఇప్పుడు టీటీడీ అంతర్గత వ్యవహారాలపైనా ఫోకస్ పెంచారు. ఏ సంస్థలు నిజంగా సరఫరా చేశాయి, వాటి సామర్థ్యం ఎంత, ఎవరి ఒత్తిడికి ఒప్పందాలు జరిగాయి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కనుగొనడమే సిట్ లక్ష్యమట.
వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి పేర్లు సిట్ రాడార్‌లో ఉండటంతో రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలైంది. అధికార పార్టీ, ప్రతిపక్షం రెండూ ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఎందుకంటే తిరుమల లడ్డూ విషయంలో ఏ వివాదం వచ్చినా అది రాజకీయ సమీకరణాలను మార్చే శక్తి కలిగినదే. దర్యాప్తు వేగం పెరగడంతో వచ్చే రోజుల్లో మరిన్ని అరెస్టులు, నోటీసులు వెలువడే అవకాశం ఉంది. కల్తీ నెయ్యి కేసు క్లైమాక్స్ ఎపిసోడ్ మొదలైందా.. అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోళ్లలో వినిపిస్తోంది.
 
			



















