తెలంగాణ కాళేశ్వరంలో కొద్దిమేరకుంగిన రెండు పిల్లర్లను సాకుగా చూపుతూ కాళేశ్వరం కూలిపోయింది.. కాళేశ్వరం కాదు..కూలేశ్వరమంటూ చేసిన తప్పడు ప్రచారానికి తెరపడింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఆసియాఖండంలోనే అతిపెద్ద పంపు హౌజ్‌లైన నందిమేడారం, గాయత్రి పంపులను ప్రభుత్వం ఆన్ చేయడంతో సోమవారం జిల్లాలోకి కాళేశ్వరం జలాలు ప్రవేశించాయి.
అయితే ఆ నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కాదని చెబుతున్న నేతలకు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పోనీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ నీళ్లు ఎందుకు రాలేదో చెప్పరు.. చెప్పలేరు. కాగా పంటలు చేతికి వచ్చేంత వరకు నీళ్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ భరతం పడతామంటూ బీఆర్‌ఎస్ హెచ్చరిస్తోంది. కాళేశ్వరం అంటే ఒక్క చోట నిర్మించిన ప్రాజెక్టు కాదు… అనేక బ్యారేజీలు, బాహుబలి మోటార్లు, కిలోమీటర్ల మేర టన్నెళ్ల సమూహం…ప్రాజెక్టు స్వరూపం పరిశీలిస్తే గోదావరి, ప్రాణహిత నదుల కలయిక అనంతరం సుమారు 30 కిలోమీటర్ల దూరంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మొదటిది.
అక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల తదనంతరం శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్, అక్కడి నుంచి నంది మేడారం రిజర్వాయర్ మీదుగా మిడ్‌మానేరుకు గోదావరి జలాలు చేరుకుంటాయి. తరువాత గ్రావిటీ ద్వారా కాకతీయ మెయిన్ కెనాల్ నుంచి లోయర్ మిడ్ మానేరుకు చేరుకొని నేరుగా బయ్యన్నవాగు ద్వారా సూర్యాపేట జిల్లాలోకి నీళ్లు ప్రవేశిస్తాయి. మొత్తం అన్ని బ్యారేజీలకు కలిపి 227 పిల్లర్లు ఉండగా కేవలం మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్లను సాకుగా చూపి కాళేశ్వరం కూలిపోయిందంటూ సీఎంతో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు చేసిన తప్పుడు ప్రచారం పటాపంచలైంది.
ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా ఉన్న సూర్యాపేట జిల్లాలోని దాదాపు 2.60 లక్షల ఎకరాలు (గోదావరి ఆయకట్టు కింద)కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తరువాత 2018 నుంచి 1.25లక్షల ఎకరాలు తుంగతుర్తి నియోజకవర్గంలో, సూర్యాపేట, కోదాడలో కలిసి మరో 1.35 లక్షల ఎకరాలు జిల్లాలో మొత్తంగా 2.60 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో మాత్రం గోదావరి ఆయకట్టు ఏనాడూ 50వేలకు మించి సాగు కాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు నీళ్ల కోసం ఆందోళనలకు దిగుతారనుకున్న ప్రతీసారి మోటార్లు ఆన్ చేస్తోంది. గతేడాది కూడా అదే మాదిరి ఆన్ చేయగా ఇటీవల పదిహేను రోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆసియాలోనే అతిపెద్ద పంపులైన నందిమేడారం, గాయత్రి పంపులను ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మిడ్‌మానేరుకు చేరుకున్న నీళ్లు లోయర్ మానేరు ద్వారా బయ్యన్న వాగుకు చేరుకుని, అక్కడి నుంచి జిల్లాలోకి ప్రవేశించాయి. అయితే మంత్రులు, నాయకులు ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి జలాలు వస్తున్నాయంటూ బుకాయిస్తున్నారు.
మరి ఉమ్మడి రాష్ట్రంలో కూడా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది కదా.. నాడు ఎందుకు నీళ్లు ఇవ్వలేదంటే మాట మారుస్తున్నారే తప్ప ఏ ఒక్కరు సమాధానం చెప్పడం లేదు. అంతే కాకుండా ఈ వానాకాలం వర్షాలు ఆలస్యంగా కురవడంతో ఇటీవలే నాట్లు పూర్తయ్యాయి. పంట చేతికి వచ్చేంత వరకు మోటార్లు ఆన్ చేసి చెరువులు నింపుతూ నీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. మళ్లీ పంటలను ఎండబెట్టాలని చూస్తే రైతులకు మద్దతుగా తాము కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించి అవసరమైతే పంపులను తామే ఆన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం బయ్యన్నవాగు రిజర్వాయర్ ఫేజ్ 2 ,నుంచి గోదావరి జలాలను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సోమవారం నీటి పారుదల శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు . ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వానాకాలం 94 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అన్నారు. దిగువ నుంచి ఎగువకు నీరు విడుదల చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 650 పై చిలుకు చెరువులు ,కుంటలతో పంటపొలాలు సస్యశ్యామలం కానున్నాయన్నారు. కాగా జిల్లాలోని ఎస్సారెస్పీ కాల్వలున్న తుంగతుర్తి, నాగారం, అర్వపల్లి, మద్దిరాల, సూర్యాపేట, చివ్వెంల ,కోదాడ మండలాల్లో భూగర్భ జలాలు పెరిగి వానాకాలం పంట చేతికి అందనుందని పేర్కొనారు.