ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఒక భారీ హామీని ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే కాకినాడ సీజ్ అవార్డు భూములను తిరిగి రైతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఆయన చెప్పారు. అయితే ఇపుడు ఆ హామీని ఆయన నెరవేర్చుకుని లబ్దిదారులైన రైతుల కుటుంబాలలో ముందే దీపావళి కాంతులు తీసుకుని వచ్చారు.
కాకినాడ సీజ్ భూములు ప్రస్తుతం రైతుల ఆధీనంలో ఉన్నాయి. వారు సాగు చేసుకుంటున్నారు. కానీ రిజిస్ట్రేషన్ మాత్రం కాకినాడ సెజ్ పేరు మీదనే ఉంది. దాంతో వారు ప్రభుత్వ పధకాలకు ఏ విధంగానూ అర్హులు కాలేకపోతున్నారు. భూములకు తామే నిజమైన హక్కుదారులమని చెప్పేందుకు ఏ విధమైన డాక్యుమెంట్లు వారి వద్ద లేవు. దాంతో ఆర్థిక సాయం ప్రభుత్వం ఇచ్చినా వారికి దక్కదు, బ్యాంకులను ఆశ్రయించాలని అనుకున్నా వారి చేతిలో పత్రాలు లేకపోవడం వల్ల రుణం కూడా పుట్టే అవకాశాలు లేవు. ఈ విధంగా రెండు దశాబ్దాలుగా రైతులు వందలాదిగా నానా అవస్థలు పడుతున్నారు తమ గోడు వినమని తమ బాధలు తీర్చమని వారంతా ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నాయి. కానీ ఎవరూ తీర్చలేకపోయారు. ఇన్నాళ్లకు వారికి కూటమి ప్రభుత్వం రూపంలో పవన్ కళ్యాణ్ గట్టి ప్రయత్నం తో ఎంతో మేలు జరుగుతోంది.
తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి పరిధిలోని భూములు అన్నీ రైతులకు డాక్యుమెంట్ల తో సహా అధికార ముద్రతో దఖలు పడనున్నాయి. ఆ విధంగా రెండు వేల 180 ఎకరాల భూమి రైతుల పరం అవుతోంది. ఈ భూములు 1551 మంది రైతులకు తిరిగి పూర్తి రిజిస్ట్రేషన్ తో దక్కబోతున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం వీరికి కల్పించిన మరో ఊరట ఏమిటి అంటే రిజిస్ట్రేషన్ రుసుములు ఉండవు, అంతే కాదు స్టాంప్ డ్యూటీ మినహాయింపు కూడా ఇస్తున్నారు.
ఇక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల రైతులకు ఈ విధంగా భారీ ప్రయోజనం దక్కనుంది. ఇక రైతుల సమస్యను పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్ళడంతో చంద్రబాబు దీనికి ఆమోదముద్ర వేశారు. దాంతో రైతాంగానికి ఎంతో మేలు జరిగింది అని అంటున్నారు ఈ మేరకు తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలను జారీ చేయడంతో రైతాంగం ఫుల్ హ్యాపీస్ అని అంటున్నారు.
ఇదిలా ఉంటే కాకినాడ రూరల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన కన్నబాబు వైసీపీ ప్రభుత్వం హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చూశారు. అయినా సరే కాకినాడ సెజ్ రైతుల సమస్య అయితే పరిష్కారం కాలేదని అంటున్నారు. అప్పట్లో కాకినాడ సెజ్ భూములపై జీవో నెం.12 విడుదల అయినా క్షేత్ర స్థాయిలో మాత్రం రైతులకు ఏ మాత్రం మేలు జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. అంతే కాదు రైతుల పేరున రిజిస్ట్రేషన్లు ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు అని అంటున్నారు. తమ బిడ్డల పెళ్ళిళ్ళకు లేదా చదువులకు ఈ భూములు ఏ మాత్రం ఉపయోగపడడం లేదని రైతులు వాపోతున్నారు. తమ పేరున భూములు లేవని అందుకే ఈ దుస్థితి అని వారు అంటున్నారు. ఇదే విషయం వారు ఉప ముఖ్యమంత్రి పవన్ ని కలిసి చెప్పుకోవడంతో ఆయన వారి సమస్యల మీద చిత్తశుద్ధిని కనబరచారు. ఇపుడు వారికి పూర్తిగా మేలు జరిగింది అని అంటున్నారు.