హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో గెలుపు కోసం అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ హోరాహోరీ పోరాడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ బరిలోకి దింపిన స్థానిక అభ్యర్ధి నవీన్ యాదవ్ కు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ చనిపోయిన మాగంటి గోపీనాథ్ భార్య సునీత నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మరోవైపు బీజేపీతో పాటు ఇతర అభ్యర్ధులు కూడా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ గెలుపు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రతిష్టాత్మకంగా మారింది.
దీంతో జూబ్లీహిల్స్ లో తాజా పరిస్ధితిని తెలుసుకునేందుకు తెలంగాణ ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో చాణక్య స్ట్రాటజీస్ సంస్థ జూబ్లీహిల్స్ లో ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించింది. ఇక్కడ నిర్వహించిన తాజా సర్వే ఫలితాలను చాణక్య సంస్థ విడుదల చేసింది. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ కంటే విపక్ష బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత ముందంజలో ఉన్నట్లు తేలింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పార్టీల పరంగా వచ్చే ఓట్ల శాతం చూసుకుంటే బీఆర్ఎస్ అత్యధికంగా 43 శాతం ఓట్లు దక్కించుకోబోతున్నట్లు తేలింది. రెండో స్ధానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 38 శాతం ఓట్లను, బీజేపీ 10 శాతం ఓట్లను సాధించబోతున్నట్లు తేలింది. మరో 9 శాతం ఓట్లు అటు, ఇటు మారే అవకాశం కూడా ఉందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. అలాగే ప్రభుత్వంపై ప్రజల్లో అభిప్రాయం చూస్తే.. 29 శాతం మందే బాగుందన్నారు. మరో 63 శాతం బాగోలేదన్నారు.
ఇక జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై ప్రభావం చూపుతున్న కీలక అంశాలను గమనిస్తే.. కుల సమీకరణాలు, వయసు-రాజకీయ సమీకరణాలు, కాంగ్రెస్ పాలన, బీజేపీ ప్రభావం, ప్రచార ప్రభావం ఇలా పలు విషయాలు ఉన్నాయి. వీటి రీత్యా చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కంటే బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత గెలుపుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చాణక్య స్ట్రాటజీస్ సంస్థ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.


















