డిప్యూటీ సీఎం పవన్ నేతృత్వంలో పల్లెపండుగ 2.0 ప్రారంభమయింది. రాజోలు నియోజకవర్గం శివకోడులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదటి పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు పవన్ తెలిపారు. పల్లె పండగ 2.0 ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
ఇప్పటికే 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. పాడి రైతుల కోసం 22,500 మినీ గోకులాలు ఏర్పాటు చేశారు. కొత్తగా 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మిస్తున్నారు. పాత రహదారుల స్థానంలో పునర్నిర్మాణం చేస్తున్నారు. 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మిస్తున్నారు. బహిరంగసభలో పవన్ కల్యాణ్ వైసీపీకి ఘాటు హెచ్చరికలు చేశారు. గత ప్రభుత్వం ఇంకో ఏడాది ఉన్నట్లయితే ప్రజలు తిరగబడేవారన్నారు. ఓటు అనే ఆయుధంతో అలాంటి అవసరం లేకుండా ముందుగానే ఇంటికి పంపారన్నారు.
ప్రజా క్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదని బూతులు మాట్లాడుతూనే ఉన్నారన్నారు. వైసీపీ వాళ్ల బూతులు మారడం లేదు. వాళ్ల బుద్ధి మారడం లేదని మండిపడ్డారు. 2029లో మళ్లీ మేము వస్తామని కలలుకంటున్న వైసీపీ బ్యాచ్ కు రాజోలు గడ్డ నుంచి పవన్ వార్నింగ్ ఇచ్చారు. మీరు రారు. అలాంటి ఆశలు పెట్టుకోకండి. అవి జరగవు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామాన్ని గౌరవించని నాయకులను ఉపేక్షించను. అది జనసేన నాయకులైనా సరే అని స్పష్టం చేశారు.


















