ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ దూకుడు చూపుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్న ఆయన.. తాను మాటిస్తే పని జరిగిపోవాల్సిందేనన్న సంకేతాలు పంపుతున్నారు. వారం రోజుల క్రితం మొంథా తుఫాన్ బాధితుల పరామర్శకు కృష్ణా జిల్లా అవనిగడ్డలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. అప్పట్లో తన దృష్టికి వచ్చిన సమస్యలపై అధికారులతో చర్చించి, వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల్లో షో చేయడానికి వెళ్లలేదని, క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని పవన్ నిరూపిస్తున్నారు.
అవనిగడ్డ నియోజకవర్గ సమస్యలపై ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ తో కలిసి మంగళగిరి క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఎదురుమొండి దీవుల్లో నివసిస్తున్న ప్రజల చిరకాల కల ఏటిమొగ, ఎదురుమొండి హై లెవల్ వంతెన నిర్మాణానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సాస్కీ పథకం నుంచి నిధులు సమకూర్చుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా నియోజకవర్గం పరిధిలో అవుట్ ఫాల్ స్లూయిజ్ ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అవనిగడ్డ ప్రాంతంలో ఉన్న అవుట్ ఫాల్ స్లూయిజ్ ల సమస్య పరిష్కారంపై చొరవ తీసుకోనున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిపోయిన అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్లే అంశంపైనా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
‘‘మొంథా తుపాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత వారం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సమయంలో నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక్క కృష్ణా జిల్లాలోనే 60 వేల మందికి పైగా సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. నమోదు చేసుకోని కౌలు రైతుల సంఖ్య కూడా ఉంటుంది. నష్టపోయిన ప్రతి కౌలు రైతుని గుర్తించి వారికి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం చర్యలు తీసుకోవాలి.’’ అని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.
అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంతంలో కాలువలను సముద్రానికి అనుసంధానిస్తూ నిర్మించిన అవుట్ ఫాల్ స్లూయిజ్ పని చేయక నాగాయలంక, కోడూరు మండలాల్లో సుమారు 5 వేల ఎకరాలు ముంపునకు గురవుతోందని పవర్ ప్రస్తావించారు. ‘‘గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇవి పూర్తిగా పని చేయకుండాపోయాయి. గ్రీజ్ పెట్టడం వంటి కనీస నిర్వహణ పనులకు కూడా నోచుకోలేదు. ఫలితంగా అవుట్ ఫాల్ స్లూయిజ్ లు మొరాయించడం వల్ల సముద్రం పోటెత్తిన ప్రతిసారి ఉప్పు నీరు తమ పొలాలను ముంచెత్తుతుందని తమ సమస్యకు పరిష్కారం చూపమని దివిసీమ రైతులు కోరుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేడు అవుట్ ఫాల్ స్లూయిజ్ లను పునరుద్ధరించేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అవుట్ ఫాల్ స్లూయిజ్ లు పునర్నిర్మాణం చేపట్టాలి. జాతీయ విపత్తుల నిర్వహణ నిధుల నుంచి నిధులు కేటాయిస్తాం. అవుట్ ఫాల్ స్లూయిజ్ ల సమస్య పరిష్కారానికి అవసరం అయితే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడుతా…’’ అంటూ పవన్ స్పష్టం చేశారు.
ఎదురుమొండి దీవుల్లో నివాసం ఉంటున్న 20 వేల మంది ప్రజల చిరకాల వాంఛ ఏటిమొగ – ఎదురుమొండి బ్రిడ్జి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం. కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన ఈ హైలెవల్ బ్రిడ్జ్ కోసం ఇప్పటికే రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయి. అలైన్మెంట్ లో మార్పుల కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిన విషయాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రూ.60 కోట్లు వరకూ నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు సాస్కీ పథకంతో నుంచీ తగిన నిధులు సమకూరుస్తామని పవన్ హామీ ఇచ్చారు. నిర్ణీత కాల వ్యవధిలో ఏటిమొగ – ఎదురుమొండి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం.
ఎదురుమొండి దీవుల పరిధిలో ఎదురుమొండి – గొల్లమంద మధ్య రహదారి నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.13.88 కోట్లు కేటాయించాము. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అయితే ఈ రోడ్డులో కొంత భాగం అటవీ శాఖకు చెందిన భూభాగం ఉంది. నాచుగుంటకు వెళ్లే రహదారి నిర్మాణం కూడా కొంత భాగం అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిపోయింది. అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి. కృష్ణా నది సముద్రంలో కలిసే హంసలదీవి పవిత్ర సాగర సంగమ ప్రాంతానికి ప్రజలు వెళ్లేందుకు అటవీ శాఖ కొంత రుసుము వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. హిందువులంతా ఈ ప్రాంతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. వసూలు చేస్తున్న రుసుము తక్కువే అయినప్పటికీ భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి అటవీశాఖ అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని పవన్ స్పష్టం చేశారు. ఒక్క నియోజకవర్గంలో పర్యటించి అక్కడ సమస్యలను పూర్తిగా తెలుసుకుని వాటి పరిష్కారానికి డిప్యూటీ సీఎం వెనువెంటనే రంగంలోకి దిగడం చర్చనీయాంశం అవుతోంది. ఒక్క అవనిగడ్డే కాదు గతంలో కూడా పవన్ వెళ్లిన ప్రాంతంలో సమూల మార్పు తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.


















