వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పీఏసీ సమావేశంలో అనేక ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. పార్టీ బాధ్యతలను జగన్ ఏకమొత్తంగా పీఏసీ సభ్యుల మీదనే పెట్టారు. పీఏసీలో ఉన్న సభ్యులు అంతా రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన వారు అని గుర్తు చేశారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలో తగిన సలహా సూచనలు ఇవ్వాలని జగన్ కోరారు. అంతే కాదు విభేదాలు ఏవైనా ఉంటే అంతా పెద్దరికంతో వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుని పోవాలని జగన్ కోరారు.
పార్టీ పట్ల జనంలో మంచి భావన ఉంది. ప్రజలు తాము ఏమి పోగొట్టుకున్నామో ఇప్పటికి తెలుసుకున్నారని జగన్ వ్యాఖ్యానించారు. అంతే కాదు కూటమి ప్రభుత్వం చెబుతున్న దానికి చేస్తున్న దానికీ ఎక్కడా పొంతన లేదని కూడా ఆయన విమర్శించారు. అందుకే ప్రజలు నమ్మకంగా వైసీపీ వైపే చూస్తున్నారు అని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనంతో కలసిపోయి వారి సమస్యలనే అజెండా చేసుకోవాలని అన్నారు వైసీపీని తిరిగి అధికారంలోకి ఎలా తీసుకుని రావాలో పీఏసీ సభ్యులు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని జగన్ కోరారు.
వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీలో వన్ టూ హండ్రెడ్ అధినాయకుడే ఉంటారు అని చెబుతారు. అయితే ఎంత మాటలలో చెప్పుకున్నా అన్నీ అధినేత ముందుండి చేయలేరు. కాబట్టి పార్టీలో ఆయన తరువాత అని ఎవరో ఒకరు ఉండాలి కదా. అలా గతంలో వి విజయసాయిరెడ్డి ఉండేవారు ఇపుడు చూస్తే నంబర్ టూ గా ఎవరూ లేరా అంటే పార్టీ వర్గాలలో అయితే చర్చ ఉంది. పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు.
ఇక చూస్తే మరో వైపు సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన రాజకీయ అనుభవం విశేషంగా ఉంది. ఆయనది నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయం. ఇక చూస్తే కనుక పీఏసీ సమావేశంలో జగన్ సెంట్రల్ పాయింట్ లో కూర్చూంటే ఒక ఆయనకు కుడి వైపున సజ్జల ఎడమ వైపున బొత్స కూర్చున్నారు. అయితే బొత్స తన సీటు మరంత దగ్గరగా జగన్ పక్కనే అన్నట్లుగా కూర్చున్నారు. దాంతో వైసీపీలో జగన్ తరువాత ఈ ఇద్దరే కీలకం అన్న చర్చ అయితే పార్టీలో సాగుతోంది.
అదే విధంగా వైసీపీలో చూస్తే మాజీ మంత్రులు కాకలు తీరిన నేతలు ఎంతో మంది ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు కూడా ఉన్నారు. అయితే వారిలో కొందరికి పార్టీ రాష్ట్ర బాధ్యతలు అంటే పెద్దగా ఆసక్తి లేదని చెబుతారు. మరికొందరు ఉత్సాహం పడినా పోటీలో వెనకబడుతున్నారని అంటున్నారు. ఇక అనూహ్యమైన పరిస్థితులు ఏమైనా జరిగి జగన్ అరెస్టు అయితే ఎలా అన్నదే చర్చ. బహుశా జగన్ పీఏసీ భేటీలో అన్యాపదేశంగా ఇదే విషయంగా దిశా నిర్దేశం చేసారా అన్న చర్చ సాగుతోంది. పార్టీలో పీఏసీ అత్యున్నత విధాన కమిటీ అని ఆయన చెబుతూ అంతా సమిష్టిగా పనిచేయాలని పార్టీ కార్యక్రమాలను సక్సెస్ ఫుల్ గా రూపొందించాలని పిలుపు ఇచ్చారు. మొత్తానికి జగన్ కి అటూ ఇటూ నేతలు ఎంతో మంది ఉన్నా కూడా ఆయన పరోక్షంలో పార్టీని లీడ్ చేయడం ఏ ఒక్కరి వల్లనో కాదని అంతా సమిష్టిగా పనిచేయాలనే అంటున్నారు.