ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిపాలనపై పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. ఏపీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పవన్.. పల్లె రోడ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆలోచనలకు దగ్గరగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న డిప్యూటీ సీఎం.. పాలన వ్యవహారాల్లోనూ ఆ పార్టీ నేతలను అనుసరించేలా కనిపిస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జాతీయ రహదారుల విషయంలో కేంద్ర మంత్రి గడ్కరీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు తెలియజేయాలని, దీని కోసం రహదారులపై క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్మాణ పురోగతిని యూట్యూబ్‌లో షేర్ చేయాలని కూడా గడ్కరీ సూచించారు. ఈ క్యూఆర్ కోడ్‌ల ద్వారా ప్రయాణికులు ప్రాజెక్టుల వివరాలను తనిఖీ చేయవచ్చు, అధికారులను సంప్రదించవచ్చు, వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చు. కేంద్ర మంత్రి గడ్కరీ ఈ ఆలోచన నుంచి స్ఫూర్తి పొందారో లేక ఆయనే సొంతంగా నిర్ణయించుకున్నారో కానీ, పవన్ కూడా ఇంచుమించు ఇదే విధమైన పద్ధతిని ఏపీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.
పల్లె రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టు పవన్ వెల్లడించారు. ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. ‘‘మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా? లేదా? ఉంటే ఎలా ఉంది? అనే వివరాలు ప్రజల చేతిలో అందుబాటులో ఉండే వ్యవస్థను తీసుకురావాలి. అసలు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని రహదారులు ఉన్నాయి? అవి ఎలా ఉన్నాయి? అనే వివరాలు కూడా ప్రతి ఒక్కరికీ తెలియాలి. కొత్త రహదారి నిర్మిస్తే అందుకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటలోకి రావాలి.
క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, రహదారులను మెరుగుపరచుకునేలా ఈ సాంకేతికత ఉండాలి.’’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్దేశించారు. అడవి తల్లి బాటను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుని ఈ సిస్టంకు అనుసంధానించాలని స్పష్టం చేశారు. జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టంను త్వరితగతిన అభివృద్ధి చేయండి. అధునాతన సాంకేతికత సాయంతో ఆ విధమైన వ్యవస్థకు రూపకల్పన చేయండి. 48 గంటల్లో అందుకు సంబంధించి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం కావాలి. ఒక వర్కింగ్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందులో పొందుపరచాలి. ఈ అంశంలో అర్టీజీఎస్, ఇంజినీరింగ్ విభాగం అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు.
కాగా, ఈ సమయంలోనే అధికారుల పనితీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు అందుబాటులో ఉన్నా పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవి తల్లిబాట, జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా తక్షణం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని హితవుపలికారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మన్ పథకం కింద వచ్చే నిధులతోపాటు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం సాయం మొత్తం కలిపి రూ.1,158 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారులు నిర్మించాలన్న సంకల్పంతో పనులు ప్రారంభించాం. అడవి తల్లిబాట పనులను వేగవంతం చేయండి. ఎక్కడైనా అటవీ శాఖతో లేదా ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తక్షణం పరిష్కరించుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
















