హైదరాబాద్ మెట్రో రెండో దశ (Metro Phase-2) ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, హైదరాబాద్ మెట్రో విస్తరణకు అవసరమైన రుణ బదిలీ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాకుండా కిషన్ రెడ్డి వెనక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారని, ఆయన కుట్రలకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు ప్రాజెక్టుకు రూపకల్పన జరిగిందని సీఎం గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి కృషితో హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టు మంజూరైందని తెలిపారు. అనంతరం రోశయ్య ప్రభుత్వ హయాంలో తొలి దశ నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు పూర్తయ్యాయని వివరించారు.
2017 నాటికి మెట్రో మొదటి దశ పూర్తికావాల్సి ఉన్నప్పటికీ, తెలంగాణ ఏర్పడిన తరువాత చారిత్రక కట్టడాల పరిరక్షణ పేరుతో అప్పటి ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించిందని సీఎం విమర్శించారు. దీంతో ప్రాజెక్టు మూడేళ్లు ఆలస్యమైందని, మొదట రూ.15 వేల కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు వ్యయం రూ.22 వేల కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు.
ప్రాజెక్టు ఆలస్యం, అనంతరం కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాలను ఎదుర్కొన్నట్లు సీఎం తెలిపారు. రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులు సృష్టించినప్పటికీ ప్రతి ఏడాది రూ.400 కోట్ల నష్టం వస్తోందని సంస్థ తమకు తెలిపిందన్నారు. ఈ కారణంగా మెట్రో రెండో దశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి ఎల్ అండ్ టీ నిరాకరించిందని వెల్లడించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మెట్రో విస్తరణపై ఎలాంటి చొరవ తీసుకోలేదని సీఎం ఆరోపించారు. ప్రజల అవసరాల కంటే తమ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. దేశంలోని ప్రధాన నగరాల జాబితాలో ఒకప్పుడు అగ్రస్థానాల్లో ఉన్న హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రో విస్తరణకు ప్రాధాన్యత ఇచ్చామని సీఎం తెలిపారు. ఇందుకోసం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఫేజ్-2 ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వాలని కోరామని చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఫేజ్-1 నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ ద్వారానే ఫేజ్-2 నిర్మించాలనే నిబంధన విధించిందని వివరించారు.
ఎల్ అండ్ టీ నిరాకరించడంతో మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమే పరిష్కారమని కేంద్రం సూచించిందని సీఎం తెలిపారు. దాంతో రూ.30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను రూ.15 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా ఉన్న రుణాలను తక్కువ వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ సంస్థల ద్వారా సుమారు రూ.3.15 లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారని సీఎం ఆరోపించారు. వాటికి 9 నుంచి 11.5 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి వచ్చిందన్నారు. అయితే తమ ప్రభుత్వం ఐఆర్‌ఎఫ్‌సీ మరియు జపాన్ ఆర్థిక సంస్థల సహకారంతో కేవలం 4 శాతం వడ్డీకే రుణం సమీకరించగలిగిందని పేర్కొన్నారు.
అయితే ఈ రుణ బదిలీ ప్రక్రియ పూర్తికావాల్సిన సమయంలోనే కిషన్ రెడ్డి అడ్డంకులు సృష్టించారని సీఎం ఆరోపించారు. మే 20న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను, మే 21న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి రుణ బదిలీ జరగకుండా చూడాలని కోరినట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఈ కారణంగానే నేడు విడుదల కావాల్సిన నిధులు నిలిచిపోయాయని పేర్కొన్నారు.
“మీకు కష్టమనిపిస్తే మీ భాగస్వామ్యం అవసరం లేదు. మీరు కేవలం ఎన్‌ఓసీ ఇవ్వండి. మెట్రో ఫేజ్-2 నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుంది” అని సీఎం స్పష్టం చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం అయినా ముందుకు రావాలని సూచించారు.
మెట్రో రెండో దశ 122 కిలోమీటర్ల మేర విస్తరించనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా ముందుకు వెళ్లేందుకు ఎన్‌ఓసీ ఇవ్వాలని కోరారు.
కిషన్ రెడ్డిపై వ్యక్తిగత గౌరవం ఉన్నప్పటికీ, ప్రజా ప్రయోజనాల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ భవిష్యత్తు రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మెట్రో విస్తరణను అడ్డుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మెట్రో మొదటి దశను పూర్తిగా స్వాధీనం చేసుకుని, రెండో దశను వేగంగా పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana


















