ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఇవాల్టి రోజున అందరి ఇండ్లలో వాడే ఫ్రిజ్ ఒక మహిళ ప్రాణాలు పోవటానికి కారణమైంది. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. రోజువారీగా వాడే ప్రిజ్ హ్యాండిల్ షాక్ కొట్టిన ఉదంతంలో హైదరాబాద్ కు చెందిన మహిళ మరణించింది. ఇప్పటివరకు ఇలాంటి ఉదంతం గురించి విన్నదే లేదు. అసలు ఫ్రిజ్ డోర్ హ్యాండిల్ షాక్ కొట్టటమేంటి? అన్న సందేహం వ్యక్తమవుతున్న వేళ.. అసలేం జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
హైదరాబాద్ మహానగర శివారులోని రాజేంద్రనగర్ లోని హైదర్ గూడ ఎర్రబోడలో 38 ఏళ్ల లావణ్య కుటుంబం నివాసం ఉంటోంది. పదకొండేళ్ల క్రితం భర్త మరణించటంతో కుమార్తెతో కలిసి ఆమె ఉంటోంది. వీరు ఉండే నివాసం రేకుల ఇల్లు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంటి గోడలకు నీటి చెమ్మ పట్టింది. దీనికి తోడు ఇంటికి ఎర్త్ లేదు. సోమవారం ఉదయం లావణ్య ఫ్రిజ్ తెరవటానికి హ్యాండిల్ పట్టుకోగా షాక్ తగిలి.. అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ షాకింగ్ ఉదంతాన్ని చూసిన ఆమె కుమార్తె 17 ఏళ్ల పూజిత తల్లిని రక్షించే ప్రయత్నంలో ఆమెకు షాక్ తగిలింది. వెంటనే ఇంటి పక్కన ఉన్న పద్మారావు వద్దకు వెళ్లిన పూజిత జరిగిన దారుణం గురించి చెప్పింది. స్థానికుల సహకారంతో వారు లావణ్యను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లుగావైద్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. రోజువారీగా వాడే ఫ్రిజ్ షాక్ కొట్టటం.. ప్రాణాలు తీయటం స్థానికంగా సంచలనంగా మారింది.