‘హరిహర వీరమల్లు’ కథ కృష్ణా నదీ తీరంలో దొరికిన విలువైన కోహినూర్ వజ్రం కులీకుతుబ్ షాల దగ్గర నుంచి మొఘలుల వద్దకు ఎలా చేరిందో చెప్పే కథ అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, హరిహర వీరమల్లు కథానాయకుడు పవన్ కళ్యాణ్ తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. హిందువులుగా బతకాలంటే పన్నులు కట్టాలనే మొఘల్ పాలకుడు ఔరంగజేబు నిజ స్వరూపాన్ని తెలిపే కథ ఇది. తనకు అడ్డొచ్చిన రక్త సంబంధీకులనే చంపిన ఔరంగజేబు స్వరూపాన్ని తెలిపే గొప్ప కథ” అని అన్నారు పవన్.
హరిహర వీరమల్లు పాత్ర పూర్తిగా కల్పితం. దీన్ని రకరకాలుగా, రకరకాల కాలాలతో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. సర్వాయి పాపన్న కథ అని, మరో వీరుడి కథగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో అంతర్లీనంగా ఔరంగ జేబ్ పాలనను చూపిస్తున్నామని అన్నారు. ధర్మం కోసం పోరాడిన యోధుడి సినిమా. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాల్సిన పరిస్థితిలో ధర్మాన్ని కాపాడేందుకు చేసే పోరాటం ఈ సినిమాలో చూపించామని తెలిపారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల ప్రకారం.. ఈ చిత్రంలో కోహినూర్ వజ్రం కోసం వెతికే వాడిగా వీరమల్లు పాత్ర ఉంటుంది. అలాగే ఔరంగ జేబ్ లాంటి కుట్రదారుకు జవాబిచ్చేవాడిగాను అతడి పాత్రను చూడవచ్చు. హరి హర వీరమల్లు చిత్రం ఈ గురువారం(24 జూలై) విడుదలకు సిద్ధమవుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ నడుమ హంగామా పీక్స్ కి చేరుకుంది.
ఓవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, తన సినిమా హరి హర వీర మల్లు ప్రచారంలో ఉధృతంగా పాల్గొంటున్నారు. పవర్ స్టార్‌లో మునుపెన్నడూ లేని ఫైర్ కనిపిస్తోంది. ఈ మంగళవారం నాడు ఆయన మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మీడియా ప్రతినిథులతో మాట్లాడారు.
తనపైనా తన సినిమాలపైనా గత ప్రభుత్వం దాష్టీకానికి దిగిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాపై కుట్రల కారణంగా నా నిర్మాతలు నష్టపోయారని పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. వీరమల్లు గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తెరకెక్కించామని తెలిపారు. ప్రకృతి విపత్తులు, మానవ విపత్తులు, రాజకీయ విపత్తులను తట్టుకొని వీరమల్లు నిలబడ్డాడు. నిర్మాతలు చాలా విషయాల్లో గుండె ధైర్యంతో నిలబడ్డారు. ఇంత ధైర్యంగా నిలబడిన నిర్మాతకు అండగా నిలబడటం నా కర్తవ్యంగా భావించాను. ప్రమోషన్లు చేయడం నా బాధ్యత అని పవన్ అన్నారు.
ఈ సినిమా చేస్తున్నపుడు చాలా కోణాల్లో ఇబ్బందులు పడ్డారు కదా? అని ప్రశ్నించగా, వీరమల్లు సినిమా నిర్మాణ సమయంలో రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని అన్నారు. విశాఖలో నన్ను హోటల్ లో నిర్భందించడం కీలక పరిణామం.. అలాగే నా సినిమా టిక్కెట్లను రూ.10, రూ.15లకు తగ్గించి గత పాలకులు ఇబ్బందులు పెట్టారు. సీమలో ఎవరికైనా పగలు ఉంటే చీని చెట్లను నరికి వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే అలవాటు ఉన్న గత పాలకుల కారణంగా నాతో సినిమాలు చేసిన నిర్మాతలు చాలా నష్టపోయారు. నన్ను పూర్తిగా దెబ్బతీయడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు. అన్నిటినీ అధిగమించి ఇప్పుడు ఈ చిత్రం బయటకు రావడం ఆనందంగా ఉందని పవన్ అన్నారు. వీరమల్లు చిత్రీకరణ సమయంలో అన్ని సంఘర్షణలు అనుభవించామని అన్నారు. ప్రస్తుత టికెట్ పెంపుపైనా పవన్ ప్రస్థావించారు.. అన్ని సినిమాలతో పాటు తన సినిమాకి టికెట్ ధరను పెంచారని, నా కోసం ప్రత్యేకంగా పెంచలేదని పవన్ అన్నారు.. నిర్మాతల కష్టం, వారి శ్రమ అన్ని పరిగణనలోకి తీసుకొని సినిమాలకు టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇస్తోందన్నారు. వీరమల్లు చిత్రం ఈ గురువారం థియేటర్లలోకి విడుదలవుతోంది.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పెద్ద హీరో సినిమా విడుదలవుతోంది అంటే, అభిమానుల్లో హంగామా ఎలా ఉంటుందో ఊహించగలం. థియేటర్ల వద్ద తొక్కిసలాటలు కూడా గతంలో చూసాం. అయితే ఫ్యాన్స్ రెచ్చిపోతే ఎలా ఉంటుందో పుష్ప 2- సంధ్య థియేటర్ ట్రాజెడీ వెల్లడించింది.
2024 డిసెంబర్‌లో సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రమోషనల్ ఈవెంట్ తొక్కిసలాటగా మారడంతో ఒక మహిళ మృతి చెందడమే గాక, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. ఆ ఘటన తెలంగాణలో పూనకాలు పుట్టించింది. ఘటన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆవేశపూరిత ప్రసంగం సినీపరిశ్రమను భయపెట్టింది.
అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా హరి హర వీరమల్లు విషయంలో రేవంత్ సహకారం అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సినీపరిశ్రమకు ఆయన నేనున్నాను! అంటూ టికెట్ పెంపునకు కూడా ఆమోదం తెలపడం ఆశ్చర్యపరిచింది. సినిమాల ప్రివ్యూల పేరుతో దోపిడీకి, జనాలకు ఇబ్బందులు తెచ్చే పనులకు తాను సహకరించనని నాడు రేవంత్ అన్నారు. ప్రజా భద్రతను కాపాడటానికి బెనిఫిట్ , ప్రీమియర్ షోలు లేకుండా చేస్తానని కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు. అయితే వీరమల్లు విషయంలో ఈ రూల్ బ్రేక్ అయింది. ప్రస్తుత అనుమతుల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఖరిని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీరమల్లు టికెట్ పెంపునకు రేవంత్ అనుమతులు ఇవ్వగానే ఒక వర్గం వివాదాగ్నిని రాజేసింది కూడా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారం.. వీరమల్లు సినిమా ప్రీమియర్ షోలకు టిక్కెట్ల ధర రూ. 600. జూలై 24 నుండి 27 వరకు మల్టీప్లెక్స్ టిక్కెట్లను అదనంగా రూ. 200 వరకూ పెంచుకునే వీలు కల్పించారు. సింగిల్ స్క్రీన్ టిక్కెట్లను అదనంగా రూ. 150కి విక్రయించవచ్చనేది వెసులుబాటు. జూలై 28 – ఆగస్టు 2 మధ్య అనుమతించబడిన పెంపు మల్టీప్లెక్స్‌లలో రూ. 150 – సింగిల్ స్క్రీన్‌లలో రూ. 106 వరకు ఉంటుంది. అయితే తెలంగాణలో టికెట్ ధరల పెంపునకు నిర్మాత ఏఎం రత్నం అనుమతి పొందడంలో ముఖ్యమంత్రి సన్నిహితుడు రోహిన్ రెడ్డికి ఘనత ఇచ్చారు. ఒక కార్యక్రమంలో రత్నం మాట్లాడుతూ- ఇటీవల తెలంగాణలో జరిగిన (అల్లు అర్జున్) సంఘటన తర్వాత మాకు టిక్కెట్ల పెంపు కానీ, ప్రీమియర్లకు కానీ అవకాశం లభించలేదు. కానీ ఇక్కడ ఉన్న రోహిన్ రెడ్డికి ధన్యవాదాలు..మాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి లభించింది అని అన్నారు. వీరమల్లు టికెట్ పెంపు వెనక ఉన్న రోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అయితే పుష్ప 2 ప్రచారంలో సంథ్య థియేటర్ ట్రాజెడీ తర్వాత అలాంటి హైప్, హంగామా లేకుండా హరిహర వీరమల్లు టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం.