ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాజధాని నగరం అమరావతిలో భాగంగా ఉన్న విజయవాడ సిటీని గ్రేటర్ విజయవాడగా మార్చేందుకు వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు ఎంపీ కేశినేని చిన్ని అందించిన ప్రతిపాదనలకు తోడు, ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కూడా ఓకే చెప్పేశారు. దీంతో ఈ నెలాఖరులోనే కీలక ప్రకటనలు వెలువడబోతున్నాయి.
సీఎం చంద్రబాబును విజయవాడకు చెందిన ఎంపీ కేశినేని, ఇతర ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు అంగీకరించారు. వెంటనే అధికారుల్ని పిలిచి ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు సాయంత్రమే గ్రేటర్ విజయవాడ ఏర్పాటుకు సంబంధించి వారు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు స్థానిక సంస్థల తీర్మానాలు చేసి పంపాలని కోరారు. దీంతో వారు ఇప్పటికే ఆయా స్థానిక సంస్థలు తీర్మానాలు చేసి ఇచ్చినట్లు తెలిపారు.
గ్రేటర్ లో మొత్తం విజయవాడ సిటీతో కలిపి 75 గ్రామాల్ని కలిపేందుకు ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో 41 గ్రామాలు 2018లోనే గ్రేటర్ కోసం తీర్మానాలు చేశాయన్నారు. కొత్త గ్రామాలు కూడా తాజాగా తీర్మానాలు చేసి ఇచ్చాయన్నారు. వీటిపై సీఎంలో కార్యదర్శి ప్రద్యుమ్న స్పందిస్తూ.. అన్నీ సక్రమంగా ఉంటే ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్ ఇస్తామని వారికి కీలక హామీ ఇచ్చారు. ఎందుకంటే డిసెంబర్ 31లోగా ఈ నోటిఫికేషన్ ఇవ్వకపోతే పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. మరోవైపు త్వరలో ఏర్పాటయ్యే గ్రేటర్ విజయవాడ పరిధిలోకి మైలవరంలోని 23 గ్రామాలు, పెనమలూరులోని 19 గ్రామాలు, గన్నవరంలో 31 గ్రామాలను ప్రతిపాదిస్తున్నారు.
ప్రస్తుతం విజయవాడ నగర పరిధిలో 10.35 లక్షల జనాభా నివసిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ లో విలీనం చేయబోతున్న గ్రామాల్లో 16 లక్షల వరకూ జనం నివసిస్తున్నారు. ఈ లెక్కన గ్రేటర్ ఏర్పాటు అయితే 26 లక్షల జనాభాకు ఇది చేరుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ నగర విస్తీర్ణం 61.88 చదరపు కిలోమీటర్లు ఉండగా.. విలీనం తర్వాత ఇది 661 చదరపు కిలోమీటర్లకు చేరబోతోంది. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ప్రక్రియ సజావుగా సాగితే త్వరలో విలీన గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వరు.
కొత్త సంవత్సరం ప్రారంభంతోనే గ్రేటర్ విజయవాడ అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది. రోడ్లు, డ్రైనేజ్, ట్రాఫిక్ నియంత్రణ, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు – అన్నింటిపైనా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
నగరంలో కీలక ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు, ఫ్లైఓవర్లు, స్టోర్మ్ వాటర్ డ్రైనేజ్ అభివృద్ధి వేగంగా కొనసాగనున్నాయి. గతంలో వరదలతో ఇబ్బంది పడ్డ కాలనీలకు శాశ్వత పరిష్కారంగా కొత్త ప్రణాళికలు అమలులోకి రానున్నాయి.
అదే సమయంలో అమరావతి ప్రభావంతో రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాల్లో కూడా చలనం పెరిగింది. ఐటీ, సేవారంగ పెట్టుబడులను ఆకర్షించేందుకు గ్రేటర్ విజయవాడను స్మార్ట్ అర్బన్ హబ్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ట్రాఫిక్ సమస్యలపై కఠిన నిర్ణయాలు, సీసీ కెమెరాల విస్తరణ, డిజిటల్ గవర్నెన్స్‌తో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలన్నది లక్ష్యం. మొత్తంగా చూస్తే, కొత్త ఏడాది గ్రేటర్ విజయవాడకు గోల్డెన్ పీరియడ్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.












