ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు యువ జంటలకు ఒక కానుక ఇస్తున్నారు. కొత్త ఏడాది నుంచి దానికి అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తోంది అని వార్తలు వస్తున్నాయి. ఏపీలో చూస్తే జనాభా రాను రానూ గణనీయంగా తగ్గిపోతోంది. ఆ మాటకు చెప్పాలీ అంటే ఉత్తరాది కంటే దక్షిణాదిన జనాభా తరుగుదల అధికంగా ఉంది. డెబ్బై దశకంలో దేశవ్యాప్తంగా అమలు చేసిన కుటుంబ నియంత్రణను దక్షిణాదిన ఎక్కువగా పాటించారు. దాంతో జనాభా రేటు చూస్తే ఈ రోజున దారుణంగా పడిపోతోంది. ఉత్తరాదితో పోలిస్తే చాలా తేడా కనిపిస్తోంది. దాంతో నాలుగవ సారి సీఎం అయిన తరువాత చంద్రబాబు ప్రతీ సభలోనూ జనాభా పెరుగుదల గురించి ఎక్కువగా చెబుతూ వచ్చారు. పిల్లలను కనమని ఆయన ప్రచారం చేయడం కూడా అంతా గమనించి ఉంటారు.
ఇక జనాభా వృద్ధి రేటు ఏపీలో గణనీయంగా తగ్గుతోంది. దానికి సంబంధించిన నివేదికలు కూడా ఆందోళనకరంగా ఉన్నాయని అని అంటున్నారు. ఏపీలో తాజా లెక్కల ప్రకారం సంతానోత్పత్తి రేటు దారుణంగా తగ్గింది. 1.5 శాతంగా అది నమోదు అయింది. ఉత్తరాదిన 2.5 శాతం పైగా ఉంది. కొన్ని చోట్ల మూడు శాతం ఉంది, కానీ ఏపీలో అయితే ఇది మరీ తీసికట్టుగా ఉంది. దాంతో పాటుగా మరో కొత్త విషయం వెలుగు చూస్తోంది. సీనియర్ సిటిజన్లు ఎక్కువ అవుతున్నారు. దాంతో ఏపీ ప్రగతికి అవసరం అయిన పనిచేసే యువత రానున్న కాలంలో తగ్గిపోతారు అని లెక్కలు చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో సగటు ని చూస్తే కనుక దేశంలో వృద్ధుల జనాభా 28.4 గా నమోదు అయితే ఏపీలో చూస్తే సగటున 32.5 శాతంగా ఉండడం ఆందోళన కలిగించే పరిణామం అని అంటున్నారు.
ఇటీవల అమరావతి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ విషయం మీద కూడా చర్చ సాగింది అని అంటున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ వివరాలను ప్రభుత్వం ముందు ఉంచింది. దీని మీద చర్చించిన మీదట ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని తెలుస్తోంది. అదేంటి అంటే ప్రతీ ఇంటిలో కచ్చితంగా ఇద్దరు పిల్లలు ఉండేలా చూడాలని. అలా ఇద్దరు పిల్లలను కనేలా యువ జంటలను ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో రెండవ బిడ్డను కంటే కనుక వారికి ప్రభుత్వం కచ్చితంగా తగిన ప్రోత్సాహాలను అందిస్తుందని కూడా భారీ హామీ ఇస్తున్నారు.
ఈ రోజున రెండో బిడ్డ అంటే చాలా కుటుంబాలు ఆలోచిస్తున్నాయి. ఆర్ధికంగా భారం అవుతుందని కూడా చెబుతున్నాయి. దాంతో ప్రభుత్వం తరఫున వారికి తగిన చేయూతని ఇస్తే తప్పకుండా ఇద్దరు బిడ్డల వైపు మొగ్గు చూపిస్తారు అని అంటున్నారు. రెండవ బిడ్డను మీరు కనండి ప్రభుత్వం వారిని ఆదుకునేలా ప్రత్యేక కార్యక్రమాలు అందిస్తుందని చెప్పబోతున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలలో ఈ విధానం ఉంది అని అంటున్నారు. ఫ్రాన్స్ హంగేరీ వంటి దేశాలలో జనాభాను అధికం చేయడానికి కొన్ని తరహా ప్రోత్సాహకాలను ఇస్తున్నారు. దానిని అధ్యయనం చేస్తూ ఏపీలో కూడా ఆ విధనాం ప్రవేశపెడతారని చెబుతున్నారు.
ఈ విషయం మీద ప్రస్తుతం అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం కొత్త ఏడాది కీలక ప్రకటన చేస్తుందని అంటున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా రానున్న కాలంలో జనాభా పెరుగుదలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇంతకాలం జనాభా నియంత్రణ విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దాని ఫలితాలు మరీ ఎక్కువ అయిపోయి ఇప్పుడు వేరే విధంగా పరిస్థితి మారింది. దాంతో జనాభా పెంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఇక మీదట కూటమి ప్రభుత్వం ఫోకస్ పెడుతుందని అంటున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ చేసుకుంటే వారికి ఇంటి స్థలాలు, అలాగే ఇతర పధకాలు అందించేవారు, అలాగే వారికి ప్రాధాన్యత కల్పించేవారు. ఇపుడు రెండవ బిడ్డను కంటే వారికి కూడా ఆ రకమైన ప్రోత్సహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తానికి ఏపీలో ప్రమాదంలో పడిన జనాభా తగ్గుదలకు చంద్రబాబు తగిన పరిష్కారాలు వెతికేందుకు సిద్ధమయ్యారు అంటున్నారు. ఈ క్రమంలో యువ జంటలకు భారీ కానుకలు ఉంటాయని కొత్త పధకాన్ని కొత్త ఏడాది ప్రకటించబోతున్నారు అని అంటున్నారు.


















