సింగపూర్. 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దక్షిణ ఆసియాలోని అతి చిన్న దేశంగా ఉంది. ఇక స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా ప్రపంచంలో 18వ ధనవంతమైన దేశంగా కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలీ అంటే వ్యాపారపరంగా ఆర్థికంగానూ బాగా అభివృద్ధి చెందిన దేశంగా సింగపూర్ ని పేర్కొంటారు. అంతే కాదు చక్కటి పర్యాటక కేంద్రంగా సింగపూర్ ని అభివర్ణిస్తారు. ఇక సింగపూర్ అంటే అక్కడి ఆకాశ హర్మ్యాలు గురించే అంతా ప్రస్తావిస్తారు. అలా భవన నిర్మాణాలలో పేరు గడించారు. కేవలం దాదాపుగా కోటి జనాభాతో ఉన్న ఈ చిన్న దేశం ప్రపంచంలో ఎన్నో రికార్డులు అందుకుంది.
ఏపీలో అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తోంది. దీని కోసం గతంలోనే అంటే 2014 నుంచి 2019 మధ్యలోనే సింగపూర్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 అక్టోబర్ లో ఆ ఒప్పందం రద్దు అయింది. అయితే గతంలో ఏర్పడిన గ్యాప్ ని తగ్గిస్తూ సింగపూర్ తో మరోసారి కలిసి అమరావతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భారీ ప్రణాళికలతో సింగపూర్ లో పర్యటించారు అని చెప్పాలి.
ఈ నెల 26న సింగపూర్ బయల్దేరిన చంద్రబాబు ఆయన మంత్రులు అధికారుల బృందం 27 నుంచి 30 వరకూ అంటే నాలుగు రోజుల పాటు సింగపూర్ లో వరుస సమావేశాలు భేటీలతో తీరిక లేకుండా గడిపారు. అధికారుల స్థాయి సమావేశాలు అక్కడ ప్రభుత్వ పెద్దలతో భేటీలతో పాటు వాణిజ్య రంగ నిపుణులతో సదస్సులు, పారిశ్రామికవేత్తలతో సదస్సులు ఇలా ఎక్కడా విరామం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు టూర్ సాగింది. . సింగపూర్ దేశాధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాన మంత్రి, ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్, అలాగే వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి టాన్ సీ లెంగ్, సెక్యూరిటీ, హోం వ్యవహారాల మంత్రి కె.షణ్ముగం తదితరులతో సీఎం సమావేశమయ్యారు. ఏపీ సింగపూర్ మధ్య సహకారాన్ని కోరారు.
అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం సింగపూర్ మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఆకాశాన్ని అంటే భవనాల నిర్మాణానికి పెట్టింది పేరుగా ఆ దేశం ఉంది. అంతే కాదు పట్టణ ప్రణాళికలో కానీ అత్యాధునిక కట్టడాల విషయంలో కానీ నాణ్యతా ప్రమాణాల విషయంలో కానీ సింగపూర్ ఒక రోల్ మోడల్ గా ఉంది. అందుకే చంద్రబాబు మరోసారి సింగపూర్ తలుపు తట్టారు. గతంలో తాను సీఎం గా ఉన్న సమయంలో కలిపిన చేయిని మళ్ళీ గట్టిగా పెనవేసి తమతో పాటు నడవాలని కోరారు.
ఏపీ గురించి ఎవరూ చెప్పలేనంతగా ముఖ్యమంత్రి బృందం అయితే సింగపూర్ లో చెప్పింది. పవర్ ఫుల్ ప్రజెంటేషన్ ద్వారా అందరికీ కళ్ళకు కట్టేలా ఏపీలో ఏమి ఉంది అన్నది వివరించింది. ఒక విధంగా చెప్పాలీ అంటే సింగపూర్ లోని వ్యాపారవేత్తలు పారిశ్రామిక వేత్తలలో సానుకూల ధోరణి అయితే కనిపించింది అని అంటున్నారు. వారంతా ఏపీ ప్రభుత్వం అందిసున్న ప్రోత్సాహలకు కానీ ప్రభుత్వం నిబద్ధతకు కానీ ఒకింత ఫిదా అయ్యారనే అంటున్నారు. సుర్బానా జురాంగ్, సెంబ్ కార్ప్, ఎస్ఐఏ ఇంజనీరింగ్, ఏఐ సింగపూర్, కెప్పెల్ కార్పోరేషన్, జీఐసీ, ఎస్ఎంబీసీ, కాపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, ఎవర్సెండై ఇంజనీరింగ్, టామ్ సెక్, విల్మర్, టీవీఎస్ మోటార్స్, మండై వైల్డ్ లైఫ్, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలోని అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.
నవంబరు 14-15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరుకావాల్సిందిగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధుల్ని సీఎం ఆహ్వానించారు. అయితే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మాత్రం ఆసక్తిగా మారింది. నిజం చెప్పాలీ అంటే చంద్రబాబు పర్యటన ఏ మాత్రం వృధా అయ్యే ప్రసక్తి ఉండదనే అంటున్నారు. ఒక విధంగా మొత్తం సింగపూర్ లోనే ఏపీ గురించి అతి పెద్ద చర్చను కూటమి ప్రభుత్వ పెద్దలు పెట్టగలిగారు అని అంటున్నారు.ఎవరెంత పెట్టుబడి పెడతారు ఏ ఏ రంగాలలో పెడతారు అన్నది అయితే చూడాల్సి ఉంది అని అంటున్నారు.