హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనాలు పూర్తి కావొచ్చాయి.11 రోజుల పాటు జరిగిన వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా… విగ్రహాల నిమజ్జనం ఆదివారం ఉదయం వరకు కొనసాగింది.
నిమజ్జనానికి శనివారం చివరి రోజు అయినప్పటికీ కొందరు నిర్వాహకులు ఆలస్యంగా ఊరేగింపు ప్రారంభించడంతో ఆదివారం వరకు కొనసాగాయి. ఆదివారం సాయంత్రానికి నిమజ్జన ప్రక్రియ ముగుస్తుందని అధికార వర్గాలు అంచనా వేసినప్పటికీ…. కొన్ని విగ్రహాలు ఆలస్యంగా చేరుకున్నాయి.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో 2.61 లక్షలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ ఎంసి) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
నగరంలోని సువిశాలమైన హుస్సేన్ సాగర్ లో 11 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారు. పండుగ ప్రారంభమైనప్పటి నుంచి జీహెచ్ ఎంసీ పారిశుధ్య కార్మికులు 11 వేల టన్నుల చెత్తను తొలగించి జవహర్ నగర్ డంపింగ్ యార్డులో వేశారు.ఆది, సోమవారాల్లో నగరంలో పెద్ద ఎత్తున పారిశుధ్య కార్యక్రమాలు చేపడతామని అధికారులు ప్రకటించారు.
వివిధ రూపాలు, పరిమాణాల్లో ఉన్న వేలాది వినాయక విగ్రహాలను శనివారం హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోని జలాశయాల్లో నిమజ్జనం చేశారు. నిమజ్జన ప్రక్రియ చాలా రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ పూజల కోసం ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఎక్కువ భాగం శనివారం నిమజ్జనం అయ్యాయి.
గణపతి బప్పా మోరియా నినాదాలతో వేలాది మంది భక్తులు తరలిరావడంతో నగరంలోని హుస్సేన్ సాగర్ సరస్సు, దాని చుట్టుపక్కల రహదారులు శనివారం ఉదయం నుంచే పండుగ శోభను సంతరించుకున్నాయి.
హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఖైరతాబాద్ కు చెందిన 69 అడుగుల ఎత్తైన గణేష్ విగ్రహాన్ని, నగరంలోని ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ ను శనివారం హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. నిమజ్జనం చివరి రోజున ఊరేగింపులు సజావుగా సాగేందుకు ప్రభుత్వం భద్రతతో సహా విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 27న తెలంగాణ వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.