ఏపీలో ఉచిత బస్సు పధకం ఎలా ఉంది అంటే హిట్ అనే జవాబు వస్తోంది. ఎందుకంటే కేవలం ఇరవై నాలుగు గంటలు తిరిగేసరికి ఏకంగా 12 లక్షల మంది దాకా ఉచిత ప్రయాణం చేశారు అంటే స్పందన మామూలుగా లేదు అనే అంటున్నారు. ఇది సెలవులలో జరిగిన పరిణామం. ఇంకా చాలా మంది మంచి ముహూర్తం చూసుకుని బస్సెక్కాలని అనుకుంటున్నారు. దాంతో సోమవారం నుంచి రోజుకు సగటున ముప్పయి లక్షల దాకా మహిళలు బస్సులో ప్రయాణించే వీలు ఉందని అంచనా వేస్తున్నారు. అంతే కాదు ఆ సంఖ్య రానున్న రోజులలో మరింతగా పెరిగే వీలు కూడా ఉంది అని అంటున్నారు.
సాధారణంగా ఆడవారు తమ కన్న వారింటికి వెళ్లాలని అనుకుంటారు. ఏపీలో కానీ దేశంలో కానీ చాలా చోట్ల పక్క పక్క జిల్లాలోనే ఎక్కువగా కన్న వారి అత్తవారి ఇళ్ళు ఉంటాయి. అందువల్ల చూసుకుంటే ఈ ఉచిత బస్సులో ప్రయాణించేందుకు అవకాశం కల్పించిన ఎక్స్ ప్రెస్ బస్సులు కన్న వారి ఇంటికి వెళ్ళడానికి నూటికి డెబ్బై శాతం మహిళలకు సరిపోతాయని అంటున్నారు. పక్క జిల్లాల దాకా ఎక్స్ ప్రెస్ బస్సులు నడుస్తాయి కాబట్టి ఆ కొరత అయితే లేదు. మిగిలిన ముప్పయి శాతం మందికి మాత్రం కన్న వారి ఇల్లు దూరంగా ఉంటోంది. దాంతో వారు రెండు మూడు బస్సులు మారితే కానీ తమ అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకోలేరు. దాంతో ఇక్కడే సమయం శ్రమ డబ్బులకు బదులు పెట్టాల్సి వస్తోంది అని అంటున్నారు.
తెలుగు నాట అందరికీ ప్రత్యక్ష దైవం కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామివారు. తమకు ఏది మంచి జరిగినా స్వామి వారిని దర్శించుకోవాలని తెలుగు కుటుంబాలు చూస్తాయి. అందులో ముందు వరసలో మహిళలు సైతం ఉంటారు. వారే ఇపుడు తమ పుట్టింటి వారి ఇళ్ళకు వెళ్ళిన తరువాత తిరుపతి ప్రయాణం చేయాలని అనుకుంటున్నారు. దాని కోసమే వారంతా ఉచిత బస్సులు అని ఎదురు చూశారు. ఒక విధంగా కళ్ళు కాయలు కాసే విధంగా చూసారు. అయితే ఈ ఉచిత బస్సులు అన్నీ మెజారిటీ రెండు జిల్లాల మధ్యనే తిరుగుతాయి. మరి తిరుపతి చేరుకోవాలంటే వంతెన వేసుకుంటూ చాలా బస్సులు మారాల్సి ఉంటుంది. అదే ఇపుడు మహిళలలో అసంతృప్తి కొంతలో కొంతకు కారణం అవుతోంది అని అంటున్నారు.
చాలా మంది పుణ్య క్షేత్రాలు సందర్శించి రావాలని అనుకుంటున్నారు. ఉచిత బస్సు అనడంతోనే వారు ప్లాన్ కూడా చేసుకుంటున్నారు. అయితే తాము ఎక్కే ఎక్స్ ప్రెస్ బస్సులు పొరుగు జిల్లా సరిహద్దు దాటి ముందుకు సాగవని తెలియడంతోనే తెగ ఫీల్ అవుతున్నారు. దాంతో చాలా మంది కోరేది ఏంటి అంటే కనీసం పుణ్య క్షేత్రాలకు నడిచే బస్సులలో అయినా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించాలని. అదే కనుక జరిగితే ఈ పధకానికి ఏ వంక పెట్టకుండా సూపర్ హిట్ అని అంతా ఏకకంఠంతో అనేస్తారు అని చెబుతున్నారు. మరి ఈ పధకం తీరు తెన్నులు దానిని వచ్చే స్పందనను చూసి మార్పులు చేర్పులు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒకవేళ మహిళల ఆలోచన ఈ విధంగా ఉంది అని సర్కార్ పెద్దలు భావించి ఏమైనా మేలు చేయాలి అనుకుంటే కన్న వారి దర్శనంతో పాటు తిరుపతి వెంకన్న దర్శనం కూడా జరిగిపోతుంది. ఆ విధంగా చేయాలని వారంతా కోరుకుంటున్నారు.