ఏపీలో సరికొత్త వ్యవహారం తీవ్ర చర్చకు, రాజకీయ రచ్చకు కూడా తెరదీసింది. సోషల్ మీడియాలో సర్కారును కార్నర్ చేస్తూ.. కొందరు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగ్.. ఇచ్చిన నివేదిక ఆధారంగా.. వారు చేస్తున్న వ్యాఖ్యలు.. దుమారం రేపుతున్నాయి. అయితే.. దీనిపై ఆర్థిక నిపుణులు.. కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తంగా అసలు కాగ్ ఏం చెప్పింది.. వాస్తవాటేంది? విమర్శలు కరెక్టేనా అనేది ఆసక్తిగా మారింది.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్).. ప్రతి రాష్ట్రానికి చెందిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన నివేదికలు ఇస్తుంది. గతంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే కాగ్ రిపోర్టులు వచ్చేవి. ఇవి కేంద్రప్రభుత్వానికి కూడా వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్రం చేస్తున్న ఖర్చులు, ఆదాయం, అప్పులు వంటి వివరాలను వెల్లడిస్తుంది. అదేవిధంగా రాష్ట్రాల జీడీపీ, కేంద్ర జీడీపీ, పన్నుల ఆదాయం ఇలా.. దేనికి దానికి లెక్కలు వెల్లడిస్తుంది. దీని ఉద్దేశం ప్రభుత్వాలను అలెర్ట్ చేయడమే.
ఇలా.. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏప్రిల్-సెప్టెంబర్ ఆరు మాసాలకు సంబం ధించిన రిపోర్టును కాగ్ గత శుక్రవారం తన వెబ్‌సైట్‌లో పెట్టింది. దీనిలో దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ విషయం రచ్చగా మారింది. దీనికి కారణం.. ఈ ఆరు మాసాల్లోనే ప్రభుత్వం 63 వేల కోట్ల రూపాయలను అప్పులు చేసిందని కాగ్ పేర్కొంది. అదేసమయంలో జీఎస్టీ ఆదాయంలో 2 వేల కోట్ల కోత పడిందని తెలిపింది.
ఈ విషయంపైనే ఇప్పుడు రచ్చ సాగుతోంది. వైసీపీ హయాంకు ఇప్పటికీ.. పోలిక పెడుతూ.. విమర్శలు వస్తున్నాయి. అయితే.. వాస్తవం ఏంటనేది కాగ్ నివేదికలోనే పేర్కొంది. అప్పులు చేసిన సొమ్మును ఏం చేశారన్నది కూడా కాగ్ పేర్కొంది. అమరావతి రాజధానికి.. అదేవిధంగా విపత్తులు, సహా.. ప్రభుత్వం పెడుతున్న మౌలిక వసతుల పెట్టుబడులకు ఎక్కువగా ఖర్చు అవుతోందని తెలిపింది. ఇక, దేశవ్యాప్తంగా జీఎస్టీ తగ్గిన ప్రభావం ఏపీపైనా పడిందన్న విషయాన్ని పేర్కొంది.
ఇక, అప్పుల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కాగ్.. ఏపీలో అప్పులు చేస్తున్నా.. మూలధన వ్యయానికి.. మూలధన పెట్టుబడులకు(అంటే రాబడి వచ్చే పథకాలు) ఖర్చు చేస్తున్నట్టు పేర్కొంది. ఇది ఒకరకంగా ఇప్పుడు ఆదాయం చూపించక పోయినా.. వచ్చే రెండేళ్లలో ఆదాయం వచ్చేలా చేస్తుందని కూడా పేర్కొంది. ఇక, రహదారులు, వంతెనల నిర్మాణం ఊపందుకున్నట్టు తెలిపింది. ఇవి కూడా మౌలిక సదుపాయాల పరిధిలోనే ఉన్నాయి.
సో.. మొత్తానికి `కాగ్` నివేదికలోని పూర్తి సారాంశం చదవకుండానే కొందరు చేస్తున్న విమర్శలకు నిపుణు లు.. ఇదే చెబుతున్నారు. పూర్తిగా అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు. కాగ్ నివేదికలో అనేక సూచన లు, మూల ధన వ్యయానికి సంబంధించిన సలహాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కానీ, దీనికి రాజకీయ రంగు పులుముకోవడంతో రచ్చగా మారిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
















