మోటార్ స్పోర్ట్స్‌లో భారత్ తరఫున మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పుణెకు చెందిన 32 ఏళ్ల రేసర్ దియానా పుండోలే ఫెరారీ గ్లోబల్ ఛాంపియన్‌షిప్‌లో పోటీ చేయనున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించబోతోంది. నవంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ‘ఫెరారీ క్లబ్ చాలెంజ్ – మిడిల్ ఈస్ట్’ పోటీల్లో ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.
ఈ ఛాంపియన్‌షిప్‌లు దుబాయ్, అబుధాబి, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాల్లోని ప్రపంచప్రసిద్ధ ఫార్ములా వన్ సర్క్యూట్‌లలో జరగనున్నాయి. ఈ పోటీల్లో దియానా, ఫెరారీ కంపెనీ యొక్క అత్యాధునిక రేసింగ్ మోడల్ అయిన Ferrari 296 Challenge కారును నడపనుంది. ప్రపంచ స్థాయి డ్రైవర్లు పాల్గొనే ఈ ఛాంపియన్‌షిప్ వేగం, ఖచ్చితత్వం, సహనంపై ఆధారపడి ఉంటుంది. “భారతదేశాన్ని ఫెరారీ గ్లోబల్ వేదికపై ప్రాతినిధ్యం వహించడం నా కల. ఈ విజయంతో భారతీయ మహిళలు కూడా మోటార్ స్పోర్ట్స్‌లో భయపడకుండా ముందుకు రావాలని ఆశిస్తున్నాను” దియానా పుండోలే అన్నారు.
పురుషాధిక్య రంగమైన అంతర్జాతీయ రేసింగ్‌లో దియానా ప్రవేశం ఆమె అకుంఠిత దీక్ష, అంకితభావానికి నిదర్శనం.దియానా తన రేసింగ్ ప్రయాణాన్ని 2018లో JK టైర్ ‘విమెన్ ఇన్ మోటార్‌స్పోర్ట్’ ప్రోగ్రామ్ ద్వారా మొదలుపెట్టి, జాతీయ స్థాయి రేసింగ్‌లో స్థానం సంపాదించింది.2024లో MRF సలూన్ కార్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని, జాతీయ రేసింగ్ టైటిల్ సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ఈ పోటీల్లో ఆమె అనేక మంది అగ్రశ్రేణి పురుష రేసర్లను వెనక్కి నెట్టింది.ఇటలీలోని ముగెల్లో, మోంజా వంటి యూరోపియన్, అలాగే దుబాయ్ ఆటోడ్రోమ్ సర్క్యూట్‌లలో కఠినమైన శిక్షణ తీసుకుని, అంతర్జాతీయ పోటీలకు సిద్ధమైంది.దివంగత తండ్రి ప్రేరణతో ఈ ప్రయాణం మొదలైందని దియానా చెబుతోంది. ప్రస్తుతం ఆమె 250 కిమీ వేగం దాటే రేసులకు శారీరక, సిమ్యులేటర్ శిక్షణతో సన్నద్ధమవుతోంది.
ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ రేస్‌లో దియానా పాల్గొనడానికి Aligned Automation, Ferrari New Delhi సంస్థలు స్పాన్సర్ షిప్ ప్రాయోజకులుగా మద్దతు ఇస్తున్నాయి.
దియానా పుండోలే అంతర్జాతీయ వేదికపై అడుగు పెట్టడం కేవలం వ్యక్తిగత విజయమే కాదు, భారతీయ మోటార్‌స్పోర్ట్స్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. ఆమె సాధించిన ఈ విజయం భారతదేశంలోని మరెందరో మహిళలకు స్ఫూర్తిగా నిలవనుంది.
 
			



















