తెలంగాణలోని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యజమాన్యాలు బంద్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల బంద్ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తాము చేసింది కాదన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు చదువుకున్న విద్యార్థులు ఎంత మంది?, ఏయే సంస్థలు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పొందాయి?, ఈరోజు ఏయే విద్యాసంస్థలు బకాయిలు అందాల్సి ఉందని ప్రశ్నించారు. దీనిపై సిట్ ఏర్పాటు చేద్దామా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
2014-15లో అప్పటి సీఎం కేసీఆర్ అసెంబ్లీ మాట్లాడిన తర్వాత… ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికను ఎందుకు తొక్కి పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ నివేదికకు సంబంధించి కూడా చర్యలు తీసుకుందామని అన్నారు. కాలేజ్ యజమానులు వ్యాపారం చేసుకుంటున్నారని… వారు సేవ ఏం చేయడం లేదని విమర్శించారు. రాజకీయ ప్రేరెపితమైన వ్యాఖ్యాలు చేయడం, అధికారులను తిట్టడం ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కావని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
‘‘ప్రభుత్వంలో 35 ఏళ్లు సేవలు అందించిన అధికారులు కూడా రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ విడతల వారీగా ఇస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనాటికి జీతభత్యాలను కూడా విడతల్లో ఇస్తుంటే, వాటిని సరిదిద్దుకుంటూ వస్తున్నాం. అయతే సహకరించాల్సిన మీరు (ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు)… వితండ వాదనతో బంద్ పెట్టడం సరికాదు. కాలేజ్‌లు బంద్ పెట్టడం వల్ల విద్యార్థులకు విద్య దూరం అవుతుంది. మేము మూడు నెలలకో, ఆరు నెలలకో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేస్తే… మరి ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడొద్దు’’ అని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలను హెచ్చరించారు.
ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న బకాయిలను తాము తొలుత ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలను కేసీఆర్ వద్దకు వెళ్లి అడగాలని మండిపడ్డారు. బకాయిలు ఉన్నవే రూ. 3,600 కోట్లు ఉంటే… రూ. 6 వేల కోట్లు ఇవ్వాలని అడుగుతున్నారని విమర్శించారు. ‘‘ఈ రకంగా ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి 12 కాలేజ్‌లకు పర్మిషన్ ఇవ్వమని పైరవీ చేసేందుకు వచ్చాడు… నేను ఇయ్యలేదు. ఇంకో ఆయన మహబూబ్‌నగర్‌లో కాలేజ్ ఉంటే, హైదరాబాద్‌లో ఆఫ్ క్యాంపస్ పర్మిషన్ ఇవ్వమని అడిగాడు… రూల్స్‌కు వ్యతిరేకమని నేను ఇవ్వలేదు. నేను ఇయ్యలేదు కాబట్టే, ఇలాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లలను వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు… కానీ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, కాబట్టి ఆ పని చేయడం లేదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే కాలేజ్ యజమానులైనా, రాజకీయ నాయకులైనా కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాలేజ్‌ల బంద్ వల్ల పిల్లలు అకాడమిక్ ఈయర్ కోల్పోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పరిశీలించేందుకు అధికారులు వెళ్తే తప్పా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. పరిశీలనకు కూడా రానివ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అడిగినవి ఇవ్వనందుకు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.
న్యాణ్యమైన విద్యను అందించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నామని… విద్యను అందించకుండా కాలేజ్‌లను బంద్ పెడితే వారితో చర్చించడానికి ఏముందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడతలవారిగా విడుదల చేస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కొత్తగా సమస్యలు వచ్చాయని సృష్టిస్తున్నారని… వారు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారు అనేది తెలియదా? అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల బంద్‌కు ముగిసింది. శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. వివరాలు… ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను 50 శాతం చెల్లించాలని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య (FATHI) డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే నిరసనలో భాగంగా ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల బంద్ కొనసాగుతుంది. అయితే తమ నిరసనలను మరింత ఉధృతం చేస్తామని… నవంబర్ 8న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అధ్యాపకులతో భారీ సభను నిర్వహించనున్నట్టు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య వెల్లడించింది.
మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థల వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. అయితే శుక్రవారం సాయంత్రం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అధికారులతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ప్రభుత్వంతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధులు సఫలం అయ్యాయి. ప్రభుత్వం దశల వారీగా రూ. 1,500 కోట్లు విడుదల చేస్తున్నట్టుగా తెలిపింది. ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదల చేసామని… మరో 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామని, మిగిలిన 300 కోట్లు కూడా త్వరలో క్లియర్ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటు చేసి, యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి అవసరమైన సంస్కరణలపై చర్చించనున్నట్టుగా తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థుల ప్రయోజనాలు, విద్యా వ్యవస్థ స్థిరత్వం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య బంద్‌తో సహా అన్ని నిరసన కార్యక్రమాలను రద్దు చేసింది. బంద్ కారణంగా వాయిదా పడిన పరీక్షలను త్వరలో రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. తమ డిమాండ్లపై సానుకూల వైఖరి కనబరిచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.
ఇక, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలలో 50 శాతం నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలను నవంబర్ 3వ తేదీ నుంచి బంద్ కారణంగా మూతబడ్డాయి. అయితే తాజాగా ప్రభుత్వంతో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో కాలేజ్‌లు యథావిధిగా తెరుచుకోనున్నాయి.
















