నకిలీ ఉత్తర్వులతో ఖైదీల విడుదల?
ఇందుగలడందులేడని సందేహము వలదు…చక్రి సర్వోపగతుండు…ఎందెందు వెతికినా అందందే గలడు…పోతన భాగవతంలోని ప్రహ్లాదుడి మాటల్లో భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడనే భావన కనిపిస్తుంది. కానీ నేటి వ్యవస్థను చూస్తుంటే మరో మాట చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
నకిలీ అనే పదం ప్రవేశించని ప్రదేశం ఉందా? నకిలీ కరెన్సీ… నకిలీ పత్రాలు…
నకిలీ స్టాంపులు…
నకిలీ బంగారం…
నకిలీ ఆహారం…
నకిలీ రేషన్…
నకిలీ ఉద్యోగ నియామకాలు…
నకిలీ ధ్రువపత్రాలు…
నకిలీ కోర్టు ఉత్తర్వులు…
ఇప్పుడు ప్రశ్న మరింత తీవ్రమైంది. నకిలీ కోర్టు ఉత్తర్వులతో జైలు గేట్లు కూడా తెరుచుకుంటే?
జైలు గేట్లకు తాళాలు ఉంటాయి. ఆ తాళాలకు కాపలాదారులు ఉంటారు.
ఖైదీని బయటకు పంపడానికి నిబంధనలు ఉంటాయి. కోర్టు ఆదేశం ఉండాలి. ఆ ఆదేశాన్ని పరిశీలించాలి. నమోదు చేయాలి. అధికారిక రికార్డులతో సరిపోల్చాలి. కానీ ఇవన్నీ దాటుకుని ఒక నకిలీ కాగితం జైలు గేటు తెరిస్తే… అది కేవలం జైలు భద్రత వైఫల్యం కాదు. అది న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసానికి పడిన పగులు.కోర్టు తీర్పుతో మనిషి జైలుకు వెళ్తాడు. కోర్టు ఉత్తర్వుతోనే బయటకు రావాలి. మరి కోర్టు ఇవ్వని ఉత్తర్వును కోర్టు ఇచ్చినట్టుగా చూపిస్తే? ఆ పత్రాన్ని జైలు అధికారులు నిజమైనదిగా భావించి ఖైదీని విడుదల చేస్తే?అప్పుడు బయటకు వచ్చేది ఒక్క ఖైదీ కాదు. వ్యవస్థపై ప్రజల నమ్మకం కూడా జైలు గేటు దాటి బయటకు వస్తుంది. జైలు అంటే నేరస్థుడిని నిర్బంధించే నాలుగు గోడలు మాత్రమే కాదు. అది కోర్టు తీర్పును అమలు చేసే చివరి సంస్థాగత కాపలా. అక్కడే నకిలీ ఉత్తర్వు పనిచేస్తే
చట్టాన్ని ఉల్లంఘించిన ఖైదీ కంటే, చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థలోని బలహీనత మరింత ప్రమాదకరం కాదా?
కర్ణాటకలో ఎనిమిదేళ్ల తర్వాత బయటపడిన నిజం ఇది. 2018 నవంబర్ 13. బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో
జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్. శంకర్ అనే ఖైదీ జైలు నుంచి విడుదలయ్యాడు. అతని విడుదలకు సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా చూపించిన ఉత్తర్వు ఉపయోగించబడింది. అది నకిలీ ఉత్తర్వు. కానీ 2026లో ఆ ఉత్తర్వు నకిలీదని జైలు అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో అప్పటి జైలు చీఫ్ సూపరింటెండెంట్, ప్రస్తుతం జైళ్ల శాఖ డీఐజీగా ఉన్న ఎం. సోమశేఖర్ పాత్రపై ఆరోపణలు వచ్చాయి. ఆయనను 2026 అక్టోబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో శంకర్, అప్పటి జైలు సిబ్బంది, శంకర్ భార్య తదితరుల పాత్రను కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ అత్యంత తీవ్రమైన ప్రశ్న తలెత్తుతోంది. ఖైదీ శంకర్ బార్య తో ఓ జైలు అధికారి అక్రమ సంబంధం పై కూడా ఈ కేసులో ఓ భాగం కావడం విశేషం.
ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వు నిజమా కాదా తెలుసుకోవడానికి అధికారిక రికార్డును పరిశీలించడం సాధ్యంకాదా? అది సాధ్యం కాకపోతే జైలు నుంచి జీవిత ఖైదీ విడుదల చేయడానికి అసలు భద్రతా ప్రమాణం ఏమిటి? ఇంకా దర్యాప్తులో ఉన్న వ్యక్తిగత సంబంధాల ఆరోపణలు నిజమా కాదా తేలాల్సి ఉంది. కానీ ఒక జైలు అధికారి, ఒక జీవిత ఖైదీ, ఖైదీ కుటుంబ సభ్యులు, నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వు, అక్రమ విడుదల ఇన్ని అంశాలు ఒకే దర్యాప్తులోకి రావడం మాత్రం వ్యవస్థను లోతుగా పరిశీలించాల్సిన అవసరాన్ని చూపుతోంది. కాంత , కనకంతో ఎంతపనైనా సులభంగా జరుగుతుంది అని ఈ సందర్భంగా పలువురు భావిస్తున్నారు.దేశంలో ఇలాంటి సంఘటనలు ఇదొక్కటే కాదు . ఇంకా అనేక సందర్భాల్లో జైళ్ల శాఖలో ఖైదీల విడుదలకు నకిలీ ఉత్తర్వులు వాడినట్లు తెలుస్తోంది.
మిజోరంలోఒక్కరు కాదు ఏకంగా 17 మంది విడుదల. కర్ణాటక ఘటనను ఒకే ఒక్క అవకతవకగా తీసుకుంటే మిజోరం మరో తీవ్రమైన హెచ్చరికను ఇచ్చింది. లుంగ్లీ జిల్లా జైలులో 2026 జనవరి 30 నుంచి మార్చి 18 మధ్య 17 మంది ఖైదీలు నకిలీ కోర్టు పత్రాలు, నకిలీ విడుదల ఉత్తర్వుల ఆధారంగా బయటకు వెళ్లినట్లు మిజోరం పోలీసులు తెలిపారు. వీరిలో పోక్సో, ఎన్‌డీపీఎస్, దొంగతనం తదితర కేసులకు సంబంధించిన ఖైదీలు ఉన్నారు. ఈ వ్యవహారం బయటపడిన తీరు మరింత ఆందోళనకరం.ఏప్రిల్ 24న ఇద్దరు అండర్‌ట్రయల్ ఖైదీలు కోర్టుకు వచ్చారు. వారి చేతిలో విడుదల ఉత్తర్వులు ఉన్నాయి. కానీ న్యాయమూర్తికి అనుమానం వచ్చింది. ఎందుకంటే వారు అంతకుముందు రోజే అదే కోర్టులో హాజరయ్యారు. వారి తదుపరి విచారణ తేదీ కూడా ముందే నిర్ణయించబడింది. అయినా వారి చేతిలో విడుదల ఉత్తర్వులు!
అనుమానం వచ్చిన న్యాయమూర్తి జైలుకు వెళ్లి పరిశీలించడంతో అసలు వ్యవహారం బయటపడింది. పోలీసుల ప్రకారం మొత్తం 17 మంది నకిలీ పత్రాల ఆధారంగా బయటకు వెళ్లారు. వారిలో ఎక్కువ మందిని తిరిగి అరెస్టు చేశారు. దర్యాప్తులో మరొక తీవ్రమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఒక ఖైదీ, జైలుకు అనుబంధంగా పనిచేసిన అంబులెన్స్ డ్రైవర్ ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నారనే ఆరోపణలపై ఇద్దరిని అరెస్టు చేశారు. నకిలీ పత్రాల తయారీలో జైలు కార్యాలయ కంప్యూటర్ ఉపయోగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
జైలు గోడల మధ్యే నకిలీ న్యాయ ఉత్తర్వుల తయారీ జరిగిందనే ఆరోపణలు వస్తే దాన్ని కేవలం నకిలీ పత్రాల కేసుగా ఎలా చూస్తాం?
ఉత్తరప్రదేశ్ లో ఒక నకిలీ ఉత్తర్వు ఒక ఖైదీ విడుదల.
2025 మార్చి 7న వారణాసి జైలు నుంచి అండర్‌ట్రయల్ ఖైదీ సునీల్ కుమార్ నకిలీ విడుదల ఉత్తర్వు ఆధారంగా బయటకు వెళ్లిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలీగఢ్‌కు సంబంధించిన కేసులో నకిలీ పత్రాల ఆధారంగా అతడిని విడుదల చేసినట్లు విచారణలో తేలింది. దీంతో అప్పటి జైలు సూపరింటెండెంట్, జైలర్, డిప్యూటీ జైలర్‌లను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఇక్కడ కూడా అదే ప్రశ్న. నకిలీ పత్రం తయారు చేసినవాడు తప్పు చేశాడు. మరి దాన్ని అధికారిక పత్రంగా స్వీకరించిన వ్యవస్థలో ఎవరు తప్పు చేశారు?తెలంగాణలో నకిలీ ఉత్తర్వు కాదు పర్యవేక్షణే లేకపోవడం. ఇది నకిలీ కోర్టు ఉత్తర్వుల ఘటన కాదు. కానీ జైలు పర్యవేక్షణ వ్యవస్థ ఎంతకాలం విఫలమవుతుందో చూపించే మరో తీవ్ర ఉదాహరణ.
1983లో జీవిత ఖైదు పడిన సండేలా వీరన్న 1983 డిసెంబర్ 17న పెరోల్‌పై విడుదలయ్యాడు. పెరోల్‌ను 1984 మార్చి 17 వరకు పొడిగించారు. మార్చి 18న జైలుకు తిరిగి లొంగిపోవాల్సి ఉంది. కానీ తిరిగి వెళ్లలేదు. 40 సంవత్సరాలు, ఒక నెల, 28 రోజులు గడిచిన తర్వాత 2024 మే 16న అతడిని పట్టుకున్నారు.ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 2013లో పదవీ విరమణ చేశాడు. 2004లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కూడా పొందాడు. ఈ అంశాలన్నీ తెలంగాణ హైకోర్టు తీర్పులో నమోదయ్యాయి.ఇది మరో ప్రశ్నను ముందుకు తెస్తోంది. ఒక జీవిత ఖైదీ పెరోల్‌పై వెళ్లి నాలుగు దశాబ్దాల పాటు తిరిగి రాకపోతే అతడిని వెతకాల్సిన వ్యవస్థ ఎక్కడ ఉంది? హైకోర్టు కూడా భవిష్యత్తులో పెరోల్‌పై విడుదలయ్యే ఖైదీలు తిరిగి లొంగిపోతున్నారా లేదా అన్నదాన్ని పర్యవేక్షించేందుకు వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించింది.
వేరు వేరు రాష్ట్రాలు వేరు వేరు ఘటనలు ఒకే ప్రశ్న?
కర్ణాటకలో నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వు.
ఉత్తరప్రదేశ్‌లో నకిలీ విడుదల ఉత్తర్వు. మిజోరంలో నకిలీ న్యాయపత్రాలతో 17 మంది విడుదల. తెలంగాణలో పెరోల్‌పై వెళ్లిన జీవిత ఖైదీ నాలుగు దశాబ్దాలు వ్యవస్థ కంటికి చిక్కకుండా బయట జీవితం కొనసాగించడం. పద్ధతులు వేరు. రాష్ట్రాలు వేరు. సంఘటనలు వేరు.
కానీ ప్రశ్న మాత్రం ఒకటే.జైలు గేట్లను కాపాడుతున్న వ్యవస్థ చట్టబద్ధతను ఎవరు కాపాడుతున్నారు?నకిలీ ఉత్తర్వు జైలు గేటు వరకు ఎలా వచ్చింది? ఇది అత్యంత కీలకమైన ప్రశ్న. ఒక నకిలీ ఉత్తర్వు తయారైంది. అది జైలు వరకు వచ్చింది. ఎవరు స్వీకరించారు. ఎవరు చదివారు. ఎవరో పరిశీలించారు. ఎవరు రికార్డులో నమోదు చేశారు. ఎవరు విడుదల ప్రక్రియ ప్రారంభించారు. ఎవరు తుది అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత గేటు తెరుచుకుంది. అంటే నకిలీ పత్రం ఒక్కరి చేతిలో తయారై ఉండొచ్చు. కానీ అది పనిచేయడానికి మాత్రం ఒక వ్యవస్థ అవసరం. అందుకే నిందితుడిని పట్టుకోవడం మాత్రమే సరిపోదు. నకిలీ పత్రం పనిచేసేలా చేసిన ప్రతి దశను పరిశీలించాలి. ప్రతి దశలో ఉన్న అందరిపై చర్య తీసుకోవాలి. వ్యవస్థ లో లోపాలు గుర్తించాలి వాటిని సరిచేయాలి.
కోర్టు ఉత్తర్వు నిజమో కాదో తెలుసుకోవడం అంత కష్టమా? ఒక సాధారణ ప్రభుత్వ పత్రాన్ని ధృవీకరించడానికి ఎన్నో స్థాయిల పరిశీలన జరుగుతుంది. కానీ ఒక నిందితున్ని లేదా ఖైదీని జైలు నుంచి విడుదల చేసే కోర్టు ఉత్తర్వు విషయంలో మాత్రం కేవలం కాగితం, ముద్ర, సంతకం చూసి సరిపెడితే? ఇది వ్యవస్థాగత ప్రమాదం. ప్రతి విడుదల ఉత్తర్వుకుఅసలు కోర్టు రికార్డుతో సరిపోల్చడం, ఉత్తర్వు సంఖ్య, తేదీ ధృవీకరణ, సంబంధిత కేసు నంబర్‌తో అనుసంధానం,డిజిటల్ కోర్టు రికార్డు పరిశీలన, కోర్టు రిజిస్ట్రీ నుంచి ధృవీకరణ, అవసరమైతే అధికారిక ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, విడుదలకు ముందు ద్వంద్వస్థాయి అధికారుల ధృవీకరణ వంటి తప్పనిసరి ప్రక్రియలు ఎందుకు ఉండకూడదు?
జైలు నుంచి విడుదల అనేది సాధారణ పరిపాలనా చర్య కాదు. అది ఒక వ్యక్తి స్వేచ్ఛను పునరుద్ధరించే అత్యంత కీలకమైన న్యాయపరమైన చర్య. అందుకే అక్కడ ఒక్క పొరపాటు కూడా ప్రాణాంతకమైన పరిపాలనా వైఫల్యంగా మారవచ్చు. బాధ్యులు ఎవరు? ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను గుర్తించాలి. నకిలీ పత్రం తయారు చేసిన వ్యక్తి నేరస్థుడు కావచ్చు. కానీ పత్రం పనిచేసేలా చేసిన ప్రతి అధికారి నేరస్థుడే అని ముందుగానే తేల్చలేం. అది దర్యాప్తు తేల్చాల్సిన విషయం. అయితే బాధ్యతను మాత్రం ప్రశ్నించాల్సిందే. ఎవరు పత్రం స్వీకరించారు?
ఎవరు పరిశీలించారు?
ఎవరు ధృవీకరించకుండా వదిలారు? ఎవరు విడుదల రిజిస్టర్‌లో నమోదు చేశారు? ఎవరు తుది అనుమతి ఇచ్చారు?
ఎన్ని స్థాయిలలో పర్యవేక్షణ విఫలమైంది?ఇవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలితే నిందితుడిని పట్టుకున్నా వ్యవస్థ మాత్రం అలాగే ఉంటుంది. వ్యక్తిగత బలహీనత వ్యవస్థాగత ప్రమాదంగా మారకూడదుత్యాగరాజ కీర్తనలోని భావం ఎంతవారలైన కాంత దాసులే. మనిషి ఎంత గొప్పవాడైనా తన బలహీనతలకు లోబడే ప్రమాదం ఉందనే మానవ స్వభావాన్ని గుర్తు చేస్తుంది. అధికారం ఉన్న చోట బాధ్యత ఉండాలి. అధికారంతో పాటు నియంత్రణ ఉండాలి.వ్యక్తిగత సంబంధాలు, మోహం, ప్రలోభం, అవినీతి ఏది అయినా వ్యవస్థలోని ఒక అధికారిని ప్రభావితం చేస్తే, దాని ప్రభావం ఒక్క వ్యక్తిపైనే పడదు. ఒక అధికారి బలహీనత వందలాది ఖైదీల భద్రతకు బలహీనత కావచ్చు. అందుకే వ్యక్తులపై మాత్రమే ఆధారపడే వ్యవస్థ కంటే, వ్యక్తి తప్పు చేసినా వ్యవస్థ తప్పును అడ్డుకునే విధానం అవసరం.
ఇక మేల్కొనాల్సింది ఎవరు?
జైలు శాఖ. న్యాయశాఖ. హోంశాఖ. కోర్టు పరిపాలన. పోలీసు వ్యవస్థ. డిజిటల్ రికార్డు వ్యవస్థ. ప్రతి ఒక్కరూ ఒకే ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఒక నకిలీ ఉత్తర్వు నిజమైన ఉత్తర్వులా పనిచేయకుండా మన వ్యవస్థలో ఎన్ని అడ్డుకట్టలు ఉన్నాయి?అవి పనిచేస్తున్నాయా?
లేక కాగితం కనిపిస్తే చాలు ముద్ర కనిపిస్తే చాలు సంతకం కనిపిస్తే చాలు అన్న స్థాయిలోనే వ్యవస్థ ఉందా? దేశవ్యాప్తంగా ఆడిట్ అవసరం. కర్ణాటకలో ఒక ఘటన.మిజోరంలో 17 మంది.ఉత్తరప్రదేశ్‌లో మరో ఘటన. తెలంగాణలో నాలుగు దశాబ్దాల పర్యవేక్షణ వైఫల్యాన్ని చూపించే ఘటన. ఇవి బయటపడినవి మాత్రమే.బయటపడనివి ఎన్ని?ఎన్ని జైళ్లలో విడుదల ఉత్తర్వులు అసలు కోర్టు రికార్డులతో సరిపోల్చకుండా అమలయ్యాయి? పెరోల్ ఖైదీలు గడువు ముగిసినా తిరిగి రాలేదు? ఎన్ని కేసుల్లో నకిలీ పత్రాలు ప్రయత్నించబడ్డాయి?
ఎన్ని చోట్ల జైలు సిబ్బంది వాటిని గుర్తించారు? ఎన్ని చోట్ల గుర్తించలేదు? ఇవన్నీ తెలుసుకోవాలంటే దేశవ్యాప్తంగా జైళ్లలో విడుదల ఉత్తర్వులు, బెయిల్ ఉత్తర్వులు, పెరోల్, శిక్ష తగ్గింపు ఉత్తర్వులపై ప్రత్యేక భద్రతా ఆడిట్ అవసరం.
నకిలీ ఉత్తర్వే నిజమైన ఉత్తర్వుగా మారితే?అప్పుడు కోర్టు తీర్పును అమలు చేసేది ఎవరు?
కాగితమా? అధికారినా?లేక అసలు న్యాయ రికార్డా? ఈ మూడు ఒకటిగా ఉండాల్సిన చోట మూడు వేర్వేరుగా మారితే చట్టం ఎక్కడుంది? చివరి ప్రశ్న సమాధానం ఎవరు చెబుతారు? నకిలీ ఉత్తర్వు తయారు చేసినవాడిని పట్టుకోవాలి. అది తప్పనిసరి. కానీ అంతకంటే ముందు ఆ నకిలీ ఉత్తర్వు పనిచేసేలా చేసిన వ్యవస్థను గుర్తించాలి. జైలు గేటు వద్దకు చేరిన నకిలీ ఉత్తర్వు మధ్యలో ఎన్ని చేతులు మారింది? ఎన్ని కళ్లను దాటింది? ఎన్ని రిజిస్టర్లలోకి వెళ్లింది? ఎన్ని సంతకాలు దాటింది?అధికారుల బాధ్యతలను దాటింది? ఒక నకిలీ కాగితం జైలు గేటు తెరిచిందంటే ఆ కాగితానికి శక్తి ఇచ్చింది ఎవరు? ఇదే అసలు దర్యాప్తు. ఎందుకంటే జైలు గోడలు ఎత్తుగా ఉండటం మాత్రమే భద్రత కాదు.ఆ గోడల మధ్య న్యాయం బతికి ఉండటం అసలైన భద్రత. నకిలీ ఉత్తర్వుతో ఒక ఖైదీ బయటకు వచ్చాడు. కానీ ఆ రోజు బయటకు వచ్చింది ఒక్క మనిషేనా? లేక వ్యవస్థలో దాగి ఉన్న అవినీతి, అధికార దుర్వినియోగం, పర్యవేక్షణ వైఫల్యం కూడా జైలు గేటు దాటి బయటకు వచ్చాయా? ఇది కేవలం జైలు శాఖకు సంబంధించిన ప్రశ్న కాదు.
Fake Court Orders ఇది న్యాయంపై ప్రజల విశ్వాసానికి సంబంధించిన ప్రశ్న.
సమాధానం చెప్పాల్సింది ఒక్క అధికారి కాదు మొత్తం వ్యవస్థ.
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















