కేంద్ర ఎన్నికల సంఘం అదిరే షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని ప్రకటించింది. తాజాగా దేశ వ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ రిజిస్టర్ రాజకీయ పార్టీలను గుర్తింపు జాబితా నుంచి తొలగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి కారణం.. గడిచిన కొన్నేళ్లుగా ఈ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనకపోవటమే కారణంగా వెల్లడించింది.
దీనికి సంబంధించిన డ్రైవ్ లో మొదటి విడతలో 334 రిజాస్టర్డ్ పార్టీలను రద్దు చేయగా.. తాజాగా 474 రాజకీయ పార్టీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు 808 రిజిస్టర్ రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేసినట్లైంది. అంతేకాదు.. నిబంధనలను పాటించని మరిన్ని రాజకీయ పార్టీల గుర్తింపును కూడా రద్దు చేయనున్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా 474 గుర్తింపు రాజకీయ పార్టీలను రద్దు చేసిన వేళ.. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఉన్నాయా? ఉంటే.. ఎన్ని పార్టీలు అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్ని చూస్తే.. ఆంధ్రప్రదేశ్ లో 17 రిజిస్టర్ రాజకీయ పార్టీలను.. తెలంగాణలో తొమ్మిది రాజకీయ పార్టీలను రద్దు చేసతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇక.. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు గుర్తింపు లేని రిజిస్టర్ రాజకీయ పార్టీలను లెక్కలోని తీసుకుంటే ఇవి ఏకంగా 2520గా ఉండటం గమనార్హం. ఇప్పటివరకు జరిపిన తొలగింపు నేపథ్యంలో గుర్తింపు లేని రిజిస్టర్ రాజకీయ పార్టీలు 2520గా ఉండగా.. తాజా తొలగింపుతో 2046 వరకు తగ్గినట్లుగా పేర్కొన్నారు. తాజా రద్దులో ఆరు జాతీయ పార్టీలు.. 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా ఉన్నట్లు ఈసీ పేర్కొంది. మొత్తంగా చూస్తే.. గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీల్లో నిబంధనల్ని పాటించని పార్టీలకు షాకివ్వటమే కాదు.. తొలగించటం.. రానున్న రోజుల్లో మరింత కఠినంగా ఉంటామని స్పష్టం చేసినట్లైంది.