కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విశేష కళ్యాణం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. మహాక్షేత్రం దశమ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడాది మాదిరిగానే దేవదేవుని విశేష కల్యాణాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు పీ వీ కృష్ణారెడ్డి, సుధా రెడ్డి దంపతుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సుధారెడ్డితో పాటు కొమ్మారెడ్డి బాపురెడ్డి, విజయభాస్కరమ్మ, పీ నాగిరెడ్డి, ప్రసన్న దంపతులు పీటల మీద కూర్చొని శ్రీనివాసుని కల్యాణాన్ని జరిపించారు.
కన్నుల పండువగా జరిగిన ఈ కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తిలకించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించి దేవదేవుడి పట్ల తమ విశ్వాసాన్ని భక్తి భావాన్ని చాటుకున్నారు. వేద పండితులు మంత్రోచ్ఛారణ తో పాటు కళ్యాణం విశిష్టతను, దాని వల్ల కలిగే మంచిని అర్ధాలతో సహా వివరించారు. శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణం నిర్వహణకు మహాక్షేత్రాన్ని, కళ్యాణ మండపాన్ని రకరకాల రంగుల పుష్పాలతో అలంకరించారు. ఆడపిల్లలు లేని వారు లక్ష్మి, పద్మావతి దేవిలను తమ కన్యకా రత్నాలుగా భావించి దివ్యశ్రీ వైఖానస భగవచ్చాస్త్ర మార్గానుసారంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించటం వల్ల కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందని వేద పండితులు వివరించారు.
చక్రస్నానం
శ్రీ వేంకటేశ్వరుని కళ్యాణానికి ముందు దేవతామూర్తులకు వేదపండితులు చక్రస్నానం జరిపించారు. బుధవారం ఉదయం నిత్య అర్చన, తోమాల సేవ అనంతరం ఉత్సవ మూర్తులను స్నపన మండపం వద్దకు తోడ్కొని వచ్చి పాలు, పెరుగు, తేనే, సుగంధ ద్రవ్యాలతో, అభిషేకం, చూర్ణ, గంధోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిలో చక్రస్నానం జరిపించారు. చక్రస్నానం సందర్భంగా కోనేటిని ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు.
శ్రీవారి చక్రస్నానం ఆచరించిన తరువాత కోనేటిలో స్నానమాచరించిన, దర్శించినా, కోనేటి నీటిని చల్లుకున్నా వంద అశ్వమేధాల శక్తీ వస్తుందని వేదపండితులు తెలిపారు. ప్రతిరోజు స్వామి వారి పుష్కరిణిలో స్నానమాచరిస్తే నదీ పుష్కరాల సమయంలో పుణ్య స్నానం చేసినంత ఫలితం ఉంటుందని తెలిపారు. శ్రీ వారిచక్రస్నానం, కళ్యాణం లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త సుధా రెడ్డి, కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ పీ. నాగిరెడ్డి, ప్రసన్న దంపతులు, వారి కుటుంబసభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీవారి పాదసేవకు ప్రత్యేకంగా
భక్తులు శ్రీ వారి పాద సేవ చేసుకునేందుకు ప్రత్యేకంగా ధర్మకర్తలు ఏర్పాట్లు చేశారు. మహాక్షేత్రాన్ని సందర్శించే భక్తులు దేవదేవుడికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటుంటారు. వారు సమర్పించిన కొబ్బరి కాయల నుంచి వచ్చే జలం శ్రీ వేంకటేశ్వరుడి పాదాలు అభిషేకించేలా ఏర్పాటు చేశారు. భక్తులు దీపారాధన చేసుకుని తమకు జ్ఞానం ప్రసాదించాలని వేసుకునేందుకు అనువుగా ఆలయ ఆగ్నేయ భాగంలో దీపారాధనకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన జ్యోతి ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటుంది. అక్కడ భక్తులు దీపారాధన చేసుకోవచ్చు.
విశేష మండపాల ప్రారంభం
డోకిపర్రు మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ మాడ వీధుల్లో విశేష మండపాలను ఆలయ ధర్మకర్త సుధా రెడ్డి ప్రారంభించారు. దక్షిణ రాజగోపురంలో కృతయుగాన్ని తెలిపే నరసింహ స్వామితో కూడిన ప్రహ్లాద సహిత శ్రీ నరసింహస్వామి ప్రణవానందా మండపం ప్రారంభించారు. పశ్చిమ రాజగోపురం త్రేతాయుగం దైవం రామచంద్రుని కొలిచేలా శ్రీ మానసానంద మండపం, ఉత్తర భాగాన ద్వాపర యుగాన్ని సూచించే శ్రీ కృష్ణ పరమాత్మతో కూడిన శ్రీకృష్ణసుధా మండపం, తూర్పు భాగంలో ఆలయం ఎదురుగా ఆగ్నేయ దిశలో భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే గజేంద్ర మోక్షంతో కూడిన పరమాత్ముని మండపాన్ని ప్రారంభించారు.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
ఈ నెల రెండో తేదీ నుంచి జరుగుతున్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దశమ బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ఏకాంత సేవతో ముగిసాయి. నాలుగురోజులపాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తి కోటి తరించేలా ధర్మకర్తలు నిర్వహించారు. సాయంత్రం దోపు ఉత్సవం, ధ్వజావరోహణం, పూర్ణాహుతి, ద్వాదశ ప్రదక్షిణాలు, విశేష ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిసాయి.

https://www.facebook.com/share/v/1K8JzHLDvY/















