తమిళనాడులోని కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన ఆ రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ సినీనటుడు విజయ్… తమిళ వెట్రిగ కళగం (టీవీకే) పేరిట పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టారు. అందులో భాగంగా గత నెల కరూర్ లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. అందులో 41 మంది చనిపోయారు. ఈ ఘటన పేరిట తనను వైరి వర్గాలు టార్గెట్ చేస్తాయని భావించిన విజయ్ సీబీఐ విచారణ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు ఊరట లబించకపోగా.. తాజాగా బుధవారం ఆయన నేరుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో టీవీకే పలు కీలక అంశాలను ప్రస్తావించింది. సిట్ దర్యాప్తు కోసం తాము వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కేసును తమకు వ్యతిరేకంగా ప్రభావితం అయ్యేలా హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని ఆ పార్టీ ఆరోపించింది. తొక్కిసలాట జరిగిన తర్వాత టీవీకే చీఫ్ విజయ్ తో పాటు ఆ పార్టీ నేతలు పరారైపోతే.. ఇతర పార్టీల నేతలు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారని, ఇదెక్కడి సంప్రదాయమని, ఇంత బాధ్యత లేని పార్టీని తాము ఇప్పుడే చూస్తున్నామంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు తప్పనిసరిగా రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు ప్రభావితం చేసి తీరుతుందని టీవీకే తన పిటిషన్ లో ఆవేదన వ్యక్తం చేసింది. ఘటన జరిగిన వెంటనే ఇతర పార్టీలకు చెందిన నేతలు అక్కడ ప్రత్యక్షమై సహాయక చర్యల్లో పాల్గొన్నారంటే… అందులో కుట్ర కోణం లేదా? అని కూడా ఆ పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో తమను తొక్కేసేందుకు పలు పార్టీలు మూకుమ్మడిగా కక్షగట్టి మరీ కుట్ర చేశాయన్న భావనతోనే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపింది. హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని టీవీకే సుప్రీంకోర్టును అభ్యర్థించింది.