వీడో ముదురు భర్త. కోట్లాది రూపాయిలు ఆస్తిపాస్తులు ఉన్నాయన్న సమాచారం తెలుసుకొని భర్త పోయిన ఒక మహిళకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవటమే కాదు.. కోట్లాది రూపాయిల ఆస్తిని కొట్టేసి షాకింగ్ ఉదంతం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాకు చెందిన బాధితురాలిని మోసం చేసిన శివప్రసాద్ అనే వ్యక్తి కోసం పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు. ఈ దారుణ మోసం గురించి తెలిస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేరు.
చిత్తూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల నాగమణికి కొన్ని సంవత్సరాల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించాడు. ఆ బెంగతో నాగమణి భర్త అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో.. కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందామని ఆమె భావించారు.ఈ క్రమంలో మధ్యవర్తిని సంప్రదించారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ గురించి చెబుతూ.. అతడి భార్య, కుమార్తె కరోనా సమయంలో చనిపోయారని అబద్దాలు చెప్పారు.
ఇదంతా నిజమేనని భావించిన నాగమణి 2022లో శివప్రసాద్ ను పెళ్లాడారు. అయితే.. శివప్రసాద్ భార్య.. కుమార్తె కరోనాతో చనిపోలేదు. వారు నిక్షేపంగా ఉన్నారు. నాగమణికి ఉన్న కోట్లాది రూపాయిల ఆస్తుల మీద కన్నేసిన అతను.. మాయమాటలు చెప్పి పెళ్లాడారు. మొదటి భర్త నుంచి వచ్చిన కోట్లాది రూపాయిల ఆస్తుల్ని తన పేరుతో సొంతం చేసుకోవటానికి భారీ ప్లాన్ వేశాడు. తనకు భారత రిజర్వు బ్యాంకు నుంచి భారీగా డబ్బులు రావాల్సి ఉందని..ఆ డబ్బులు రావాలంటే కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పి నమ్మించాడు. భర్తే కదా అని నమ్మిన నాగమణి భర్త తండ్రి.. సోదరుడు.. అన్న ఖాతాల్లోకి తన సొమ్మును బదిలీ చేశారు. అంతేకాదు.. నాగమణి ఫోర్జరీ సంతకాలతో మొదటి భర్త నుంచి సంక్రమించిన రూ.15 కోట్ల భూమిని.. రూ.10 కోట్ల విలువైన భవనాన్నిఅమ్మేశాడు. ఆమె ఆభరణాల్ని బ్యాంకులో తనఖా పెట్టేశాడు. బంధువుల పెళ్లికి వెళ్లాల్సి ఉన్న వేళ.. బంగారు ఆభరణాల కోసం ఆమె ఒత్తిడి చేయటంతో పరారయ్యాడు. భర్తను వెతుక్కుంటూ బంగారుపాళ్యం వెళ్లిన నాగమణికి.. శివప్రసాద్ అసలు రంగు బయటపడటమే కాదు.. అతడి మొదటి భార్య.. కుమార్తె చనిపోలేదని.. నిక్షేపంగా ఉన్నారన్న విషయం వెలుగు చూసింది. దీంతో.. జిల్లా ఎస్పీని ఆశ్రయించిన ఆమె తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో శివప్రసాద్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ వైనం స్థానికంగా పెను సంచలనంగా మారింది.