రాష్ట్రాన్ని ఒంటి చేత్తో కంట్రోల్ చేయొచ్చు. వ్యవస్థల్ని కనుసైగతో నిలువరించొచ్చు. ఏమైనా చేయొచ్చు. కానీ.. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ.. చైతన్యానికి ప్రతీక.. ఎంతటి శక్తివంతమైన పాలకుడైనా సరే.. అక్కడకు అడుగు పెట్టేందుకు కాస్త ఆలోచించేలా చేసే ఉస్మానియా విశ్వవిద్యాలయం నడి గడ్డ మీద మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనదైన ఉగ్రరూపాన్ని ప్రదర్శించి.. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడిన ఆయన.. మరే ముఖ్యమంత్రి చేయలేని సాహస.. సంచలన ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఉస్మానియా విశ్వ విద్యాలయానికి వచ్చి.. ఈ తరహాలో దమ్ము ప్రకటన చేసిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ నిలిచిపోతారని చెప్పాలి. సోమవారం పలు ప్రారంభోత్సవాలకు.. శంకుస్థాపనలతో పాటు.. వర్సిటీ విద్యార్థులను కలిసి.. వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఇంతకూ సీఎం రేవంత్ నోటి నుంచి వచ్చిన మాటేమంటే.. త్వరలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం వద్దకు మళ్లీ వస్తానని.. విద్యార్థులతో కలిసి ఆర్ట్స్ కాలేజీ వద్ద పెద్ద వేదిక నుంచి మాట్లాడతానని పేర్కొన్నారు.
అంతేకాదు.. ఆ సమయంలో తాను నిధులతో వర్సిటీకి వస్తానని.. అప్పటికప్పుడు నిధులను విడుదల చేస్తానని చెప్పటం ఒక ఎత్తు. అంతకుమించి అన్నట్లుగా మరో కీలక వ్యాఖ్య చేశారు. ఈసారి తాను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చినప్పుడు క్యాంపస్ లో ఒక్క పోలీసు కూడా ఉండకూడదని చెబుతూ.. ఆ విషయంలో వీసీ.. పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తనకు చిత్తశుద్ధి ఉందని.. ఇచ్చిన హామీల్ని పూర్తి చేస్తానని చెప్పిన సీఎం రేవంత్.. నిరసనలు చేసే హక్కు అందరికి ఉందని.. నిరసనలు చేసే వారితో తానే నేరుగా మాట్లాడతానని వ్యాఖ్యానించటం గమనార్హం.
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తదితరులంతా విశ్వవిద్యాలయ విద్యార్థులేనని పేర్కొన్న సీఎం రేవంత్..కొందరు వ్యక్తులు ఉస్మానియా వర్సిటీని కాలగర్భంలో కలపాలని చూశారని మండిపడ్డారు. 108 ఏళ్ల వర్సిటీ చరిత్రలో వర్సిటీకి దళితుడ్ని వైస్ ఛాన్సలర్ గా చేసి చూపించిన విషయాన్ని ప్రస్తావించారు. విద్యార్థులకు ఇబ్బంది పెట్టే అంశాలపై నిరసన తెలపాలని ముఖ్యమంత్రే సూచన చేయటం గమనార్హం. సమస్యల్ని పరిష్కరించేందుకు వచ్చిన వారిని అడ్డుకోవద్దన్న సీఎం రేవంత్..డిసెంబరులో వర్సిటీకి వచ్చే రోజున క్యాంపస్ లో ఒక్క పోలీసు కూడా ఉండకూడదని స్పష్టం చేశారు.
తనను అడ్డుకునే విద్యార్థులకు తానే సమాధానం చెబుతానని చెప్పిన మాట ఇప్పుడు సంచలనంగా మారింది. గడిచిన కొద్ది కాలంగా నిరసనలకు భయపడి వర్సిటీకి అధికారంలో ఉన్న ముఖ్యనేతలు రావటమే మానేసిన పరిస్థితి. అందుకు భిన్నంగా తన తర్వాతి పర్యటన వేళ పోలీసులు క్యాంపస్ లో ఉండొద్దని.. నిరసనలు చేసే విద్యార్థులతో తానే నేరుగా మాట్లాడతానన్న ముఖ్యమంత్రి రేవంత్ మొదటి వాడిగా చెప్పాలి. విద్యార్థుల ఆందోళనలు.. నిరసనలపై ఈ తరహాలో రియాక్టు కావటం అందరిని ఆకర్షిస్తోంది. మరి.. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా డిసెంబరు పర్యటనలో వర్సిటీలో ఒక్క పోలీసు కూడా ఉండరా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి.