జూన్ 1 నుంచి ఏపీలో థియేటర్ల బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సరిగ్గా పవన్ కళ్యాణ్ నటించిన `హరి హర వీరమల్లు` రిలీజ్ అవుతున్న సమయంలో బంద్ ప్రకటించడంతో? దీని వెనుక రాజకీయం జరుగుతుందా? అన్న అంశం తెరపైకి వస్తోంది. పవన్ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవాలనే ఈ బంద్ ప్రకటించారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అలా కాకపోతే ఇప్పటి వరకూ లేని బంద్ ఇప్పుడే దేనికంటూ జనసైనికులు ఆరోపిస్తున్నారు.
`హరిహర వీరమల్లు` సినిమా జూన్ 12 న విడుదల నేపద్యంలో ఆ నలుగురు కుట్ర చేశారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆరోపించారు. దీనికి సంబంధించి ఏపీ సినిమాటోగ్రాఫర్ కందుల దుర్గేష్ విచారణకు కూడా ఆదేశించారు. పవన్ వ్యాఖ్యలను ఉద్దేశించి బన్నీ వాస్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే.. `ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి. చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల్లో పరిశ్రమ నలిగిపోతుంది. ఇవన్నీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు గ్రహించాలి. సినిమా పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేసామంటే మన మద్య ఐక్యత ఎలా ఉందో ప్రశ్నించు కోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ వ్యాఖ్యలు చేసి కొన్ని గంటలవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ నలుగురు అంశంపై నిర్మాత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు.ఈ రోజు నాలుగున్నర గంటల సమయంలో గీతా ఆఫీస్ లో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అల్లు అరవింద్ మీడియా ముందు ఏం మాట్లాడుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది.