ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన చెవిరెడ్డిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో ఈ రోజు ఉదయం చెవిరెడ్డి ఆయన అనుచరుడు వెంకటేశ్ నాయుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు చెవిరెడ్డిని పోలీసు కస్టడీలో ఉంచి విచారించనున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి చెవిరెడ్డి అనుచరులు ఇద్దరిని సిట్ తాజాగా అరెస్టు చేసింది. చెవిరెడ్డి అరెస్టు తర్వాత తమను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే భయంతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పారిపోయిన చెవి రెడ్డి పీఏలు బాలాజీ, నవీన్ లను సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు.
కోర్టు నిర్ణయంతో చెవిరెడ్డిని ఉదయం 8 గంటల సమయంలో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. అయితే చెవిరెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే సమయంలో ఆయన పెద్దగా కేకలు వేయడంతో కాసేపు కలకలం రేగింది. జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో తనపై తప్పుడు కేసు పెట్టారంటూ చెవిరెడ్డి గట్టిగా అరిచారు. ఒక రాజమౌళి లాంటి గొప్ప దర్శకులు, నటులు చాలా మంది ఉన్నారని, తరువాత ఎవరినీ వదిలేది లేదంటూ హెచ్చరించారు చెవిరెడ్డి.
లిక్కర్ స్కాంలో చెవిరెడ్డిని ఏ38గా పోలీసులు అభియోగాలు మోపారు. ఆయన సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు ఏ 39గా కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సమయంలో చెవిరెడ్డి ముందుగా జైలులో ఉన్న దేవాలయంలో పది నిమిషాల పాటు పూజలు చేశారు. ఇక తనకు ఇంటి భోజనం పంపాలన్న చెవిరెడ్డి అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. మరోవైపు చెవిరెడ్డి కస్టడీపై టెన్షన్ నెలకొంది. పోలీసుల విచారణలో ఆయన చెప్పే అంశాలే కేసులో కీలకంగా మారనున్నాయి. అయితే అరెస్టు అయిన నుంచి స్కాంతో తనకు సంబంధం లేదని చెవిరెడ్డి వాదిస్తున్నారు.
చెవిరెడ్డి అనుచరులు అరెస్టు
స్కాంలో తనకు సంబంధం లేదని చెవిరెడ్డి వాదిస్తున్నా, ఆయనకు మద్యం స్కాంలో లింకు ఉందని నిరూపించేందుకు పోలీసులు పక్కా ఆధారాలు సేకరిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ సరిహద్దుల్లో స్వాధీనం చేసుకున్న రూ.8.2 కోట్ల నగదు మద్యం ముడుపులే అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అప్పట్లో ఆ డబ్బు రవాణా చేసిన చెవిరెడ్డి పీఏలు నవీన్, బాలాజీని తాజాగా అరెస్టు చేశారు. గతంలో ఎన్నికల కమిషన్ ఆ డబ్బును స్వాధీనం చేసుకోగా, మద్యం స్కాంలో అరెస్టు అయిన ఏ39 వెంకటేశ్ నాయుడు తన కంపెనీ డబ్బు అంటూ ఆధారాలు చూపి ఆ నగదును తీసుకున్నాడు. అయితే సిట్ విచారణలో ఆ డబ్బు మద్యం ముడుపులుగా అందినదే అని తేలడంతో పోలీసులు చెవిరెడ్డి పీఏలు ఇద్దరిని అరెస్టు చేశారు.