ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా, ఆయనపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ అక్రమాల కేసులో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని తేల్చేశారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టుకు నివేదించారు. రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ కేసును వైసీపీ అధికారంలో ఉండగా, నమోదు చేశారు. అప్పట్లోనే చంద్రబాబుపై అభియోగాలు నమోదు చేయించిన వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు చూపలేకపోయిందని విమర్శలు ఎదుర్కొంది. ఇక తాజాగా ఆధారాల్లేని కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు సీఐడీ కోర్టుకు తెలియజేసింది.
గత ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష చంద్రబాబుతోపాటు 16 మందిపై సీఐడీ కేసు పెట్టింది. దీనిపై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు తాజాగా కేసు మూసివేస్తున్నట్లు కోర్టుకు తెలియజేసింది. ఫైబర్ నెట్ లో అక్రమాలేవీ జరగలేదని సీఐడీ తన నివేదికలో తెలిపింది. సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు ఫైబర్ నెట్ పూర్వపు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.మధుసూదనరెడ్డి, ప్రస్తుత ఎండీ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. బుధవారం కోర్టుకు స్వయంగా హాజరైన అధికారులు కేసును ఉపసంహరించుకుంటున్నట్లు రాతపూర్వకంగా మౌఖికంగానూ తెలియజేశారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయని కేసులు నమోదు చేయించింది. టెర్రాసాఫ్ట్ సంస్థకు అయాచితంగా రూ.321 కోట్ల లబ్దిని చేకూర్చారంటూ 2021 సెప్టెంబరు 11న నాటి ఫైబర్ నెట్ ఎండీ ఎం.మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసు పెట్టిన రెండేళ్ల తర్వాత 2023 అక్టోబరు 11న చంద్రబాబు పేరు చేర్చారు. అయితే భారత్ నెట్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన రూ.3480 కోట్లలో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్ కు బదలాయించినట్లుగా సీఐడీ నిర్ధారించలేకపోయింది.
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫైబర్ నెట్ కేసులో అక్రమాలు జరగలేదని, ఆర్థిక అక్రమాలు లేవంటూ సీఐడీ ధ్రువీకరించింది. అంతేకాకుండా అప్పట్లో చంద్రబాబుపై కేసు పెట్టిన అధికారి మధుసూదన్ రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరై అక్రమాలు ఏం జరగలేదని చెప్పడం గమనార్హం. కాగా, చంద్రబాబుపై రాజకీయ కక్షతోనే జగన్ ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ అధికారంలో ఉండగా ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని ఆరోపిస్తోంది. మరోవైపు చంద్రబాబుపై కేసులు ఉపసంహరించుకుంటున్నారనే సమాచారం ముందే తెలుసుకున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక రోజు ముందుగానే మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ చంద్రబాబుపై కేసులు పెడతామని హెచ్చరించడం చర్చనీయాంశమైంది.


















