ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. మహిళ క్రికెటర్ శ్రీచరణికి రెండున్నర కోట్ల రూపాయల నగదుతో పాటు విశాఖలో ఐదు వందల గజాల స్థలాన్ని ఇవ్వాలనిమంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. మొత్తం నలభై అంశాలపై కేబినెట్ సమావేశం చర్చించింది. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం కోసం రుణాన్నితీసుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నాబార్డు నుంచి 7,258 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
అదే సమయంలో పలు సంస్థలకు భూకేటాయింపులు చేయడానికి కూడా కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది. అలాగే ఎస్ఐడీపీ ఇచ్చిన పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. తద్వారా యాభై వేల ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు కేబినెట్ అభిప్రాయపడింది. రెండున్నర గంటల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని మంత్రులను ఆదేశించారు. ఫైళ్ల క్లియరెన్స్ లో మరింత వేగం పెంచాలని, నాలుగైదు రోజుల్లో క్లియర్ చేయాలన్నారు. కేబినెట్ భేటీకి ఆలస్యంగా వచ్చిన ఆరుగురుమంత్రులపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
మంత్రివర్గం అజెండా అంశాలు ముగిశాక మంత్రులతో సీఎం చంద్రబాబు ఇతర అంశాలపై చర్చించారు. రుషికొండ ప్యాలెస్పై మంత్రివర్గ ఉపసంఘం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సబ్ కమిటీకు వచ్చిన ప్రతిపాదనలు బట్టి, ఎలా వినియోగించాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే విధంగా వీలైనన్ని ఎక్కువ పర్యాటక ఈవెంట్లు నిర్వహించాలని పర్యాటక, అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలు జరగాలని సూచించారు. రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా చూడాలి అని ఆదేశించారు.
పీఎం కుసుమ్, సూర్యఘర్ వంటి పథకాల్లో కేంద్రం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. పగటి పూట విద్యుత్ వినియోగ భారం తగ్గించుకునేలా ఈ 2 పథకాలను ఎక్కువ ప్రోత్చహించాలని తెలిపారు. చేనేతలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
పరిశ్రమలకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఇన్‌ఛార్జ్ మంత్రులు సమీక్షలు చేయకపోవడం సరికాదని మంత్రులతో సీఎం చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఇన్‌ఛార్జ్ మంత్రులు తన దృష్టికి తీసుకురావాలి కానీ, తానే మంత్రుల పనితీరు సమీక్షించే పరిస్థితి రాకూడదని హితవు పలికారు. పరిశ్రమల ఏర్పాటుతోపాటు స్థానిక సమస్యల పరిష్కార బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తీసుకోవాలని సూచించారు.
ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్లకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టని వాటిని సమీక్షించాలని స్పష్టం చేశారు. నిరుపయోగంగా ఉన్న కాలనీలపై తదుపరి నిర్ణయం తీసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పాత నిబంధనలు రద్దు చేసి మరింత మెరుగ్గా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


















