పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ, ఎమ్మెల్యేతో సహా ఇతర నేతలపై సుమారు 500 మంది దుండగులు దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనలో బీజేపీ మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ ఖాగెన్ ముర్ముకు తీవ్ర గాయాలై, ఆయన దుస్తులు రక్తంతో తడిసిపోయాయి. ఈ దాడి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి.
మల్దహా ఉత్తర ఎంపీ ఖాగెన్ ముర్ము, సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్, బీజేపీ బెంగాల్ యూనిట్ చీఫ్ సమ్మిక్ బట్టాచార్యతో కలిసి జల్‌పైగురి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతమైన నాగరాకటలో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి, వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 500 మందితో కూడిన గుంపు అకస్మాత్తుగా బీజేపీ నేతలపై రాళ్లు, చెప్పులు, కర్రలు, ఇతర మారణాయుధాలతో దాడికి తెగబడింది. “బీజేపీ నేతలు వెంటనే ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలి” అంటూ దుండగులు పెద్దగా నినాదాలు చేశారు. ఈ దాడిలో ఎంపీ ఖాగెన్ ముర్ము తల భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తస్రావం కారణంగా ఆయన ధరించిన కుర్తా పూర్తిగా తడిసిపోయింది. దాడిలో నేతలు ప్రయాణిస్తున్న వాహనం కూడా ధ్వంసమైంది.
దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీ ఖాగెన్ ముర్ముతో పాటు ఇతర నేతలను బీజేపీ శ్రేణులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. గాయాలతో బాధపడుతున్న ఎంపీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ దారుణ దాడిపై బీజేపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “టీఎంసీ బెంగాల్‌లో క్రూరత్వం రాజ్యమేలుతోంది, కరుణ చూపిస్తే శిక్ష పడుతోంది.” అని మాలవీయ ఆరోపించారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు టీఎంసీ నేతలు ముందుకు రావడం లేదని, కానీ సహాయం చేయడానికి వెళ్లిన బీజేపీ నేతలపై దాడి చేయించడం హేయం అని ఖండించారు.
మరోవైపు, టీఎంసీ ఐటీ సెల్ చీఫ్ దేబాంగ్షు భట్టాచార్య ఈ ఆరోపణలను ఖండించారు. ఈ దాడిలో తమ పార్టీ కార్యకర్తల ప్రమేయం లేదని, ఇది కేవలం సామాన్య ప్రజల ఆగ్రహం మాత్రమేనని పేర్కొన్నారు.
కాగా గత కొన్ని రోజులుగా ఉత్తర బెంగాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వర్షాల కారణంగా డార్జిలింగ్ జిల్లాలోని మిరిక్, కుర్సియాంగ్ వంటి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దూదియా ఐరన్ బ్రిడ్జి కూలిపోవడంతో ఆ ప్రాంతంలో రవాణా పూర్తిగా స్తంభించింది. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజాప్రతినిధిపై దాడి జరగడం రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది.