బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఘట్టంలో అసలు స్టోరీ శుక్రవారం నుంచే ప్రారంభం కానుందా?.. అంటే ఔననే అంటున్నారు రాజకీయ నాయకులు. వాస్తవానికి రెండు దశల్లో ఇక్కడ 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనిలో తొలి భాగం 121 స్థానాలకు గురువారం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రెండో భాగానికి ఈ నెల 11న ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది. దీనిలోనే అసలు కథంతా ఉందని పార్టీలు అంచనా వేస్తున్నాయి.
అన్ని పార్టీలకు కీలకమైన పూర్వాంచల్ ప్రాంతంలో(4 జిల్లాలు) 57 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిని సాధ్యమైనం త వరకు తమవైపు తిప్పుకోగలిగితే.. అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ సొంతం అవుతుందన్న వాదన ఉంది. రెండో దశలో 122 స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే.. ఈ స్తానాల్లోని మెజారిటీ సెగ్మెంట్లు.. మైనారిటీ సహా యాదవ సామాజిక వర్గం డామినేషన్‌లో ఉన్నాయని రాజకీయ నేతలు చెబుతున్నారు.
దీనికితోడు.. భిన్నమైన పార్టీల ప్రబావం కూడా ఇక్కడే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిణామాలకు తోడు.. తొలిదశ ఎన్నికల పోలింగ్‌లో 67 శాతం ఓటింగ్ నమోదు కావడంతో అధికార పార్టీ బీజేపీ నేతృత్వంలోని జేడీయూల కూటమికి ఒకింత ఇబ్బందిగానే ఉందన్న చర్చ మొదలైంది. ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలి రావడం.. ఓటు వేయడం వంటివి.. ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేవిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రెండో దశను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.
తుదిదశ ఎన్నికల పోలింగ్ కు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 11న రెండో దశ ఎన్నిక ల పోలింగ్ జరగనుంది. అంటే.. 9వ తేదీ సాయంత్రమే ప్రచారం ఆపేయాలి. సో.. దీనిని గమనించిన పార్టీలు.. ఈ మూడు రోజుల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. బీజేపీ కూటమి తరఫున ప్రధాని మోడీ.. ఈ మూడు రోజులు ప్రచారంలోపాల్గొంటారు. ఇక, కాంగ్రెస్ అగ్రనేతలు.. ప్రియాంక, రాహుల్ గాంధీలు.. బీహార్‌లోనే తిష్ఠవేశారు. మొత్తంగా.. ఈ మూడు రోజుల్లో చేసే ప్రచారం.. పార్టీలకు కీలకంగా మారనుంది. దీంతో ఇప్పటి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుందని అంటున్నారు.


















