ఏపీలోని కర్నూల్ పట్టణంలో తిరుమలరావు అనే బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల పట్టణంలోని రాజావీధి నగర్‌కు చెందిన ప్రవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32) ను దారుణంగా హత్య చేశాడు. బ్యాంకు మేనేజర్ ప్రియురాలి బిడ్డను తేజేశ్వర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తేజేశ్వర్ హత్య జరిగింది.
తిరుమలరావు కర్నూలులోని ఓ బ్యాంకులో
మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ బ్యాంకులో చిరుద్యోగి అయిన, కల్లూరుకు చెందిన మహిళతో అతడికి అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో గద్వాలకు చెందిన గంట తేజేశ్వర్.. సదరు మహిళ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లి అమ్మాయి తల్లికిగానీ, ఆమె ప్రియుడైన బ్యాంకు మేనేజర్‌గానీ నచ్చలేదు.
దాంతో గంట తేజేశ్వర్‌ను ఎలాగైనా హతమార్చాలని ఇద్దరూ కుట్రపన్నారు. అతడు ప్రైవేట్ సర్వేయర్ కావడంతో భూమి సర్వే పేరుతో రప్పించి హత్య చేయాలని పథకం వేశారు. అనుకున్న ప్రకారం కర్నూలులో తేజశ్వర్‌కు పరిచయం ఉన్నవారితో ఫోన్ చేయించి, ల్యాండ్ సర్వే పేరు చెప్పి రమ్మన్నారు. నమ్మి వచ్చిన తేజేశ్వర్‌ను బ్యాంకు మేనేజర్ హత్యచేశాడు.
ఐదు రోజులైనా తేజేశ్వర్ జాడ కనిపించకపోవడంతో అతని అన్న తేజవర్థన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో తేజేశ్వర్ తప్పిపోయినట్లు కేసు నమోదైంది. గద్వాల ఎస్పీ ప్రత్యేక బృందంతో ముమ్మరంగా దర్యాప్తు చేశారు. శనివారం రాత్రి గద్వాల పోలీసులు కర్నూలుకు వచ్చి కర్నూలు 3 టౌన్ సీఐ శేషయ్య సహకారంతో విచారించారు.
ఈ క్రమంలో పాణ్యం సమీపంలోని పిన్నాపురం చెరువు దగ్గరలో తేజేశ్వర్ మృతదేహాన్ని పోలీసులు మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా గుర్తించారు. పాణ్యం పోలీసుల సహాయంతో ఆ మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యలో బ్యాంకు మేనేజర్‌తోపాటు మరికొందరి హస్తం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని గద్వాల ఎస్సై కళ్యాణ్ చెప్పారు