బాహుబలి సిరీస్ రెండు చిత్రాలకు ఎలాంటి క్రేజ్ అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్ క్లూజన్ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ తోపాటు భారీ వసూళ్లు సాధించాయి.
ఇప్పుడు ఆ రెండు సినిమాలు ఒకే పార్ట్ గా.. బాహుబలి: ది ఎపిక్ పేరుతో శుక్రవారం (అక్టోబర్ 31న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది. అయితే రీ రిలీజ్ సందడి నేటి ప్రీమియర్స్ తోనే మొదలైంది. ఇంటర్నేషనల్ ప్రీమియర్స్ షోలు కూడా ప్రదర్శించడంతో ఇప్పటికే సినిమాను చాలా మంది విదేశాల్లో చూసేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కూడా మూవీ చూసి ఇప్పటికే రివ్యూ ఇవ్వగా.. అనేక మంది ఎన్ఆర్ఐలు కూడా పోస్టులు పెడుతున్నారు. సినిమా కోసం చెబుతూ వస్తున్నారు. సినిమా, ఇంటర్వెల్ సహా మొత్తం కలిపి నాలుగు గంటలు అయిందని చెబుతున్న సినీ ప్రియులు.. మూవీలో ఒక్క కొత్త సీన్ కూడా లేదని అంటున్నారు. ప్రమోషన్స్ లో రాజమౌళి ఇప్పటికే చెప్పినట్టు సూపర్ హిట్ సాంగ్స్.. పచ్చబొట్టు, మనోహరి తొలగించినట్లు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో ఇప్పటికీ మూవీ ఐకానిక్ గా ఉందని చెబుతున్నారు. కొన్ని సీన్స్ ఇప్పటికీ పవర్ ఫుల్ గానే అనిపిస్తున్నాయని, సేనాపతిని తల నరకడం సహా పలు సన్నివేశాలకు గూస్ బంప్స్ అని అంటున్నారు.
ఫస్ట్ పార్ట్ అంతా కాలకేయ యుద్ధానికి సంబంధించిన సీన్స్ డామినేట్ చేశాయని నెటిజన్లు చెబుతుండగా.. రాజమౌళి చాలా సీన్స్ తొలగించామని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సెకండాఫ్ లో ఎక్కువ అనుష్క సీన్స్ ఉన్నాయని అంటున్నారు. ఏదేమైనా మరోసారి విజువల్ వండర్ ను విట్నెస్ చేశామని కామెంట్లు పెడుతున్నారు. అయితే సినిమా కంటెంట్ పాతదే అయినా.. మళ్లీ అలరించిందని చెబుతున్నారు. గొప్ప కథ అంటూ కొనియాడుతున్నారు. అయితే ఎపిక్ వెర్షన్ నుంచి కొత్తగా ఏం ఆశించకూడదని.. కానీ మెప్పిస్తుందని అంటున్నారు. అదే సమయంలో మరికొందరు.. ఇప్పటికే అప్పుడు మూవీ చూసిన వాళ్ళు.. కొత్తగా ఏం లేదని అంటున్నారు. ఓల్డ్ గానే అనిపిస్తోందని చెబుతున్నారు.
ఇప్పుడు ఉన్న కొత్త కొత్త టెక్నాలజీల పరంగా చూసుకుంటే.. మాత్రం సినిమా పాతగా అనిపిస్తుందని కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి ఫస్ట్ పార్ట్ బాహుబలి ది బిగినింగ్ వచ్చి పదేళ్లు కంప్లీట్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికి మూవీ మేకింగ్ లో చాలా డిఫరెన్సెస్ వచ్చాయని చెప్పాలి. టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది. దీంతో అందుకే ఓల్డ్ గా అనిపిస్తుందని కొందరు అంటున్నారు. అలా బాహుబలి ఎపిక్ వెర్షన్ కు సంబంధించి ఫారిన్ మూవీ లవర్స్.. పెట్టిన పోస్టులు ఇప్పుడూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో ప్రీమియర్స్ నడుస్తున్నాయి. మరి ఇక్కడ వాళ్ళు ఏమంటారో.. ఎలాంటి రివ్యూస్ ఇస్తారో వేచి చూడాలి.
 
			



















