స్వార్థం పుట్టించిన ఆరవ భూతం – అవినీతి
ఒకప్పుడు మన పెద్దలు పిల్లలకు ఐదు భూతాల గురించి చెప్పేవారు. భూమి జీవనానికి ఆధారం… నీరు ప్రాణానికి మూలం… అగ్ని శక్తికి ప్రతీక… వాయువు ఊపిరి… ఆకాశం అనంతానికి చిహ్నం. ఈ పంచభూతాల సమతుల్యత వల్లే ప్రపంచం నిలబడుతోంది.పంచభూతాలు సృష్టిని నిలబెడతాయి. కానీ ఈ ఆరవ భూతం సమాజాన్ని కూల్చేస్తుంది.నేడు ఆరవ భూతం నిశ్శబ్దంగా మన జీవితాల్లోకి ప్రవేశించింది. అది ప్రకృతి సృష్టించింది కాదు. దేవుడు ప్రసాదించింది కాదు. మనిషి స్వార్థం, అత్యాశ, విలువల పతనం కలసి సృష్టించిన భూతం. అదే అవినీతి. ఇది చొరబడని రంగం లేదు. చివరకు ప్రతి ఒక్కరి ఆలోచనల్లో కూడా స్థానం సంపాదించుకుంది.
అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే అవినీతి ఇప్పుడు మనల్ని భయపెట్టడం లేదు. మనల్ని సిగ్గుపడేలా చేయడం లేదు. అది నేరం అనే భావన క్రమంగా కనుమరుగవుతోంది. ఒకప్పుడు లంచం తీసుకొన్నాడంటేనే తలదించుకునేవారు. ఇప్పుడు పట్టుబడినా సిగ్గుపడడం లేదు. లంచం ఒక నేరం నుంచి అలవాటుగా మారింది. అలవాటు నుంచి సంస్కృతిగా మారింది. సంస్కృతి నుంచి మానసిక బానిసత్వంగా మారింది.ఎక్కడ చూసినా అవినీతి గురించి చర్చే. సభల్లో అదే నినాదం. ఎన్నికల్లో అదే హామీ. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మౌనం. ప్రజల ముందు అవినీతిని శపించే పెదవులే, అవకాశం వచ్చినప్పుడు దానితో రాజీపడటానికి ఎందుకు వెనుకాడవు? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంది?
ఇటీవలి కాలంలో ఏసీబీ బయటపెట్టిన అక్రమాస్తుల కేసులు చూస్తే కళ్లు చెదిరిపోతాయి.
TGREDCO (మాజీ ట్రాన్స్‌కో) డివిజనల్ ఇంజనీర్ వద్ద సుమారు రూ.80 కోట్లకు పైగా మార్కెట్ విలువైన ఆస్తులు గుర్తించారు. గతంలో కూడా లంచం కేసులో పట్టుబడిన ఈయనపై ఇది రెండో కేసు నమోదైంది. పాత కేసుతో కలిపితే మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లకు మించి ఉండొచ్చని అంచనా.మరో ఏసిబి కేసులో ఓ డీఎస్పీ వద్ద సుమారు రూ.200 కోట్లకు పైగా మార్కెట్ విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ వద్ద రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు.రోడ్లు–భవనాల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ వద్ద రూ.100 కోట్లకు పైగా ఆస్తులపై ఏసీబీ సోదాలు నిర్వహించింది.మాజీ అదనపు ఎస్పీ వద్ద కూడా రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ వద్ద కూడా వంద కోట్లకు పైగా విలువైన ఆస్తులు బయటపడ్డాయి.ఈ జాబితా ఇక్కడితో ముగియదు. ఇవి బయటపడిన తిమింగలాలు మాత్రమే. ఇంకా సముద్రంలో దాగి ఉన్నవి ఎన్నో. దొరికితే దొంగ… దొరకకపోతే దొర… అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
అవినీతికి ప్రాణవాయువు సమాజం చూపుతున్న సహనం. లంచం తీసుకునేవాడు ఒకడు. ఇచ్చేవాడు ఇంకొకడు. ఇద్దరూ చేతులు కలిపితేనే అవినీతి పుడుతుంది. తర్వాత అదే ఇద్దరూ వ్యవస్థను తిడతారు. ఇది వ్యంగ్యమా? విషాదమా?
డబ్బు ఇవ్వకపోతే పని జరగదు. అందరూ ఇలానే చేస్తున్నారు.కాలమే ఇలా ఉంది. ఇవి కారణాలు కావు. మన తప్పును మనమే సమర్థించుకోవడానికి వేసుకున్న ముసుగులు.నేడు అవినీతి అంటే కోట్ల రూపాయల కుంభకోణాలే గుర్తుకొస్తున్నాయి. కానీ నిజానికి చిన్న తప్పులే పెద్ద అవినీతికి విత్తనాలు.నిజాయితీ ఇప్పుడు గౌరవం కాదు . అమాయకత్వంగా కనిపిస్తోంది. అవినీతితో ఎదిగిన వారిని విజయగాథలుగా చూపిస్తున్నాం. నిజాయితీగా బతికేవారిని చేతకానివారిగా చూస్తున్నాం. విలువలు తలకిందులైతే సమాజం నిలబడదు. అవినీతి దేశ సంపదను మాత్రమే దోచుకోదు. ఒక విద్యార్థి భవిష్యత్తును దోచుకుంటుంది. ఒక నిరుద్యోగి అవకాశాన్ని దోచుకుంటుంది. ఒక రైతు హక్కును దోచుకుంటుంది.
ఒక పేదవాడి సంక్షేమాన్ని దోచుకుంటుంది. ఒక నిజాయితీపరుడి ఆత్మవిశ్వాసాన్ని దోచుకుంటుంది. చివరికి ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉండాల్సిన నమ్మకాన్నే దోచుకుంటుంది.అవినీతి నిర్మూలనకు కేవలం ఏసీబీ దాడులు సరిపోవు. అరెస్టులు సరిపోవు. చట్టాలు మాత్రమే సరిపోవు. సమాజం మొత్తం మారాలి. మొదటిగా, ప్రభుత్వ సేవలన్నింటినీ పూర్తిగా డిజిటల్ చేయాలి. మనిషి జోక్యం తగ్గిన కొద్దీ అవినీతికి అవకాశాలు తగ్గుతాయి. రెండవది, అక్రమాస్తుల కేసుల్లో విచారణకు కాలపరిమితి ఉండాలి. సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్‌లో ఉండకూడదు. దోషులు తక్షణమే శిక్ష అనుభవించేలా ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి. మూడవది, అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని ప్రభుత్వానికి జప్తు చేయాలి. జైలుశిక్ష కంటే అక్రమ సంపదను కోల్పోవడమే అవినీతిపరుడికి పెద్ద శిక్ష.
నాలుగవది, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధుల ఆస్తులపై కూడా ప్రతి ఏడాది స్వతంత్ర సామాజిక ఆడిట్ తప్పనిసరి చేయాలి.
ఐదవది, పాఠశాల స్థాయి నుంచే విలువల విద్యను బలపరచాలి. నిజాయితీని పుస్తకాలలో కాకుండా జీవిత పాఠంగా బోధించాలి. ఆరవది, లంచం అడిగిన అధికారికి భయపడకుండా ఫిర్యాదు చేసే వారికి పూర్తి రక్షణ, ప్రోత్సాహం కల్పించాలి.ఏడవది, ఓటును అమ్ముకునే రాజకీయ సంస్కృతిని ప్రజలే తిరస్కరించాలి. డబ్బుకు ఓటు వేయడం కూడా అవినీతిలో భాగమే.నేను లంచం ఇవ్వను. తీసుకోను. తప్పును సహించను. అన్న స్థాయిలో చైతన్యం వచ్చినప్పుడు ఆ నిర్ణయం ప్రతి వ్యక్తి ఆచరించగలిగినప్పుడు లక్షల చట్టాల కంటే శక్తివంతమైంది అవుతుంది . లంచం ఆగుతుంది.పంచభూతాలు ప్రకృతిని నిలబెడతాయి. కానీ స్వార్థం పుట్టించిన ఈ ఆరవ భూతం సమాజాన్ని కూల్చేస్తుంది. దీనిని ఓడించే ఆయుధం చట్టం మాత్రమే కాదు.నిజాయితీ.
ఆ నిజాయితీ ప్రభుత్వ కార్యాలయంలో పుట్టదు. Corruption
న్యాయస్థానంలో పుట్టదు. అది ప్రతి మనిషి మనస్సులో పుట్టాలి. అవినీతి లేని దేశం కావాలా? లేక అవినీతితో రాజీపడే జీవితమా?
ఈ ప్రశ్నకు సమాధానం ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం లేదు.ప్రతి పౌరుడు అద్దం ముందు నిలబడి తన మనసాక్షిని అడగాలి.
ఎందుకంటే దేశ భవిష్యత్తు పార్లమెంట్‌లో రాయబడదు .ప్రతి పౌరుడి మనస్సాక్షిలో రాయబడుతుంది. ఇది జరిగాక పోతే పంచభూతాలు కొంత కాలం కనుమరుగైపోయి పునర్జన్మ జరిగితే ఆరవ భూతం అంతరించ వచ్చు .
నరసింహారెడ్డి చందమూరి.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు.
కదిరి.


















