ఏపీలో మొత్తం ఓటర్లలో సగానికి సగం మహిళా ఓటర్లు ఉన్నారు వారికి అనేక పథకాలు అమలు చేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గడచిన పద్నాలుగు నెలల కాలంలో సూపర్ సిక్స్ పధకాలను ఒక్కోటిగా అమలు చేస్తూ వచ్చారు. ఇపుడు అందులో కీలకమైనదిగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ శుభ వేళ అమలు చేస్తున్నారు. ఈ పధకంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అతి పెద్ద అచీవ్ మెంట్ ని సాధించింది అని అంటున్నారు.
ఏపీలో ఈ పథకం కింద లబ్దిదారులు చూస్తే ఎక్కడా లేని విధంగా అతి పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం రెండు కోట్ల 62 లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఈ పధకాన్ని బాబు రూపకల్పన చేసి శ్రీకారం చుట్టారు. ఉచిత బస్సుతో రాష్ట్రమంతా తిరిగే అధికారాన్ని మహిళలకు ఇచ్చామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. వారికి ఆర్ధిక స్వావలంబన సాధికారిత ఇచ్చే విషయంలో తానే ఎపుడూ ముందున్నాను అని కూడా చెప్పారు. మహిళల కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అందులో ఇది అతి ముఖ్యమైనది అన్నారు.
ఆకాశంలో సగం అవకాశాలలో సగం గా ఉన్న మహిళలకు ఏపీలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే మొత్తం బస్సులలో సగం కంటే ఎక్కువే ఉచిత బస్సు పధకానికి కేటాయించారు. మొత్తం బస్సులు 11,449 ఉంటే అందులో ఏకంగా 74 శాతం బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 8,500 బస్సుల దాకా ఏపీలో ఉచిత బస్సు పధకానికి కేటాయించారు. ఈ ఉచిత బస్సులలో మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్ కూడా ప్రయాణించవచ్చు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పూర్తి కసరత్తు చేసి మరీ కాస్తా ఆలస్యం అయినా ఈ పధకాన్ని ప్రారంభించారు అని అంటున్నారు. స్త్రీ శక్తి పధకం ద్వారా మహిళలకు ప్రయాణం ఖర్చులు ఎంత ఆదా అవుతాయో కూడా డేటా ప్రభుత్వం సేకరించి పెట్టుకుంది. ప్రభుత్వం వేసుకున్న అంచనా ప్రకారం రాష్ట్రంలోని మహిళలు వివిధ బస్సులలో వారానికి నాలుగు సార్లు ప్రయాణం చేస్తారు. ఉద్యోగులు అయితే రోజూ వారీ కనీసం రెండు నుంచి నాలుగు సార్లు ప్రయాణిస్తారు. దీనికి వారికి నెలకు వేయి నుంచి మూడు వేల రూపాయల వరకూ ఖర్చు అవుతోంది. ఈ ఉచిత బస్సుల వల్ల ఆ సొమ్ము మహిళల వద్ద మిగిలినట్లే అని అంటున్నారు.
ఇక ఏపీలో పేదలు మధ్యతరగతి వర్గాల మహిళలు ఎక్కువగా ఉన్నారు. వారంతా ఈ పధకం ద్వారా నూరు శాతం లబ్ది పొందుతారు అని అంటున్నారు. అంతే కాదు మొదట కేవలం అల్ట్రా పల్లె వెలుగు, పల్లె వెలుగు, సిటీ బస్సులకే ఈ పధకం పరిమితం చేయాలని అనుకున్నా దూర ప్రయాణాలకు సైతం అవకాశం ఇస్తే పుణ్య క్షేత్రాలకు వెళ్ళేవారు పర్యాటక ప్రాంతాలకు వెళ్ళేవారు సైతం లబ్ది పొందుతారు అన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఎక్స్ ప్రెస్ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో సైతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతించింది. దాంతో ఈ పథకం ద్వారా అత్యధిక శాతం లబ్ది పొందడమే కాకుండా ప్రభుత్వం పట్ల కూడా వారు సానుకూలంగా ఉంటారని భావిస్తున్నారు.