ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు (సోమవారం) ముంబైలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఆయన తన పర్యటనను కొనసాగించనున్నారు. ముంబైలో పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీల నిర్వాహకులను ఆయన ఆహ్వానించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలువురు అగ్రగామి వ్యాపార ప్రముఖులతో భేటీ కానున్నారు. వారిలో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ట్రాఫీగురా (Trafigura) సీఈఓ సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ (ESR group) హెడ్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ సాదత్ షా, హెచ్‌పీ ఐఎన్సీ (Hp Inc) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూ స్టార్ లిమిటెడ్ (Blue star Limited) డిప్యూటీ చైర్మన్ వీర్ అద్వానీ వంటి ప్రముఖులు ఉన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించిన కీలక అంశాలపై మంత్రి లోకేష్ వారితో చర్చించనున్నారు.
అలాగే, ఈరోజు సాయంత్రం ముంబైలో నిర్వహిస్తున్న 30వ సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) భాగస్వామ్య సమ్మిట్ (పార్టనర్ షిప్ సమ్మిట్) రోడ్ షోలో కూడా మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. నవంబర్‌లో విశాఖపట్నం వేదికగా జరగనున్న భాగస్వామ్య సమ్మిట్‌లో పాల్గొనాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను మంత్రి వారికి తెలియజేయనున్నారు.