ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరోసారి చేనేత కార్మికుల పక్షంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 7న జరగనున్న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని.. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది కేవలం ఎన్నికల హామీ మాత్రమే కాకుండా.. చేనేత రంగాన్ని ఆదుకునే దిశగా తీసుకున్న గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు..
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పథకంతో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. అంతేకాకుండా ప్రతి పవర్‌లూమ్ యూనిట్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రతిపాదనలకు మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఆమోదం లభించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 93,000 మందికి పైగా నేతన్నల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. అలాగే 10,534 పవర్‌లూమ్ యూనిట్లు కూడా దీని వల్ల ప్రత్యక్షంగా లబ్ధిపొందుతాయి.
ఇది రాష్ట్రంలోని చేనేత రంగానికి మరింత ఊతం అందిస్తుందని భావిస్తున్నారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం సుమారు రూ.120 కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి చేనేతలకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో సంప్రదాయ వృత్తులు ముఖ్యంగా చేనేత రంగం కష్టాల్లో పడుతుంది. ఉత్పత్తి ఖర్చులు పెరిగి, ఆదాయం తగ్గిపోవడం, మార్కెటింగ్ లోపం, ఆధునిక రంగాల పోటీ వల్ల నేతన్నలు వృత్తిని వదిలేసే పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో వారికి ఉచిత విద్యుత్ పథకం ఆసరాగా నిలుస్తుందని భావిస్తున్నారు. కాగా పథకం అమలుకు సంబంధించి అధికారిక ఆదేశాలు ఇంకా రావాల్సి ఉంది.
మొత్తంగా ఈ పథకం ద్వారా ప్రతి చేనేత కుటుంబం నెలకు రూ.950 – రూ.1,250 వరకు విద్యుత్ బిల్లులో మినహాయింపు పొందుతుందని అనుకుంటున్నారు. అలాగే ప్రతి పవర్ లూమ్ యూనిట్ నిర్వహకుడికి నెలకు రూ.2,000 – రూ.2,500 వరకు లాభం చేకూరనుందని అంచనా వేస్తున్నారు.