రేషన్ కార్డు దారులకు బిగ్ అప్డేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ సరఫరాలో కీలక మార్పులు తెచ్చింది. గతంలో ఉన్న వాహనాల స్థానంలో తిరిగి రేషన్ దుకాణాల ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లబ్దిదారులకు స్మార్ట్ కార్డులను అందిస్తోంది. ఇక.. కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా రేషన్ దుకాణాలను మినీ మాల్స్ గా మార్చాలని డిసైడ్ అయింది. ఇదే సమయంలో రేషన్ సరఫరాలో ఇచ్చే వస్తువుల విషయంలో మరింత ప్రయోజనకరంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం అన్ని చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం కార్డుదారులకు ఇప్పుడు ఇస్తున్న బియ్యం, పంచదారతో పాటు జనవరి 1 నుంచి రాగులు, గోధుమ పిండి కూడా అందించను న్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ రెండు సరకులను నవంబరు నుంచే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇస్తున్నామని, జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందించేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అంగీకరించారని చెప్పారు.
దిల్లీలో కేంద్రమంత్రి జోషీతో మనోహర్ సమావేశమయ్యారు. జనవరి నుంచి పీడీఎస్ బియ్యం బస్తాలను క్యూఆర్ కోడ్ ట్యాగ్ ఆధారంగా అందజేస్తామని చెప్పారు. తద్వారా బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుంది. స్కూళ్లు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేసే బియ్యం బస్తాలపై ఇప్పటికే ఈ విధానం అమలవుతోందని మనోహర్ వెల్లడించారు.
కాగా, ఈ ఏడాది రాష్ట్రంలో 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం అంగీకరించగా, ఇప్పటికే 17.30 లక్షల టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు. 2.60 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,120 కోట్లు జమ చేసినట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,550 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, 16 వేల మంది సిబ్బంది, 32 వేల వాహనాలు పని చేస్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 7.85 కోట్ల గోనె సంచులు అందించామని మంత్రి మనోహర్ తెలిపారు.
రాష్ట్రంలో ఎఫ్‌సీఐకి ప్రస్తుతం 7.85 కోట్ల టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా, మరో 3.87 కోట్ల టన్నుల మేర పెంచేందుకు కేంద్ర మంత్రి జోషీ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం పీపీపీ విధానంలో స్టీల్ సైలోస్‌లు ఏర్పాటు చేస్తామన్నారు వడ్లు. అధికంగా పండించే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీటిని నిర్మిస్తామని తెలిపారు.












