రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతుల వరకు సిలబస్‌లో కీలక మార్పులు అమలుకానున్నాయి. జాతీయ విద్యా విధానం (NEP) మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఈ మార్పులను చేపడుతోంది. ఈ ప్రక్రియను రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) పర్యవేక్షిస్తోంది.
1 నుంచి 5 తరగతుల వరకు దాదాపు 40 శాతం సిలబస్ మార్పులు చేయనుండగా, 6, 7, 8 తరగతుల్లో పూర్తి సిలబస్‌ను పునరుద్ధరించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ అమలులో ఉండగా, ఇటీవల ఎన్సీఈఆర్టీ చేసిన తాజా మార్పులకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను తిరిగి రూపొందిస్తున్నారు.
6 నుంచి 8 తరగతుల్లో తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో పెద్దగా మార్పులు ఉండవు. అయితే సాంఘిక శాస్త్రంలో చరిత్ర, భూగోళశాస్త్రం అంశాలను స్థానిక అవసరాలు, రాష్ట్ర ప్రత్యేకతలకు అనుగుణంగా సవరించనున్నారు. మిగతా సబ్జెక్టులన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగానే కొనసాగుతాయి.
ఇక పరీక్షల ప్రశ్నల విధానంలోనూ మార్పులు తీసుకొస్తున్నారు. నేరుగా ఒకే లైన్ జవాబులు రాసే విధానానికి బదులుగా, పాఠ్యపుస్తకం మొత్తాన్ని అర్థం చేసుకుని సమాధానాలు రాయాల్సిన విధంగా ప్రశ్నలను రూపొందించనున్నారు. దీని వల్ల విద్యార్థుల్లో చదవడం, విశ్లేషణ చేయడం, ఆలోచనా శక్తి పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
ఈ మార్పులతో విద్యార్థులు కేవలం పుస్తకాలు ముక్తాయించి చదవడం కాకుండా, అర్థవంతమైన అభ్యాసం వైపు అడుగులు వేస్తారని ప్రభుత్వం ఆశిస్తోంది.
NewSyllabus












