ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చారిత్రక అడుగులు వేస్తున్నారు. యూఏఈలో తన మూడు రోజుల పర్యటనలో భాగంగా దుబాయ్‌లో తొలిరోజు పర్యటించిన ఆయన, అక్కడి ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి ఏపీకి భారీ పెట్టుబడులకు సానుకూల స్పందన రాబట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్ సమావేశమయ్యారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీకి ఉన్న అద్భుతమైన వరం అని వివరించిన సీఎం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైలు కనెక్టివిటీ ఉండేలా బహుళ ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.ముఖ్యంగా దుగరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మించే దిశగా ప్రణాళికలు వేస్తున్నట్లు వివరించారు.దీనికి సానుకూలంగా స్పందించిన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, ఏపీలో షిప్ బిల్డింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఇది లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేయడంలో కీలకమవుతుంది.
వైద్యారోగ్య రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ షంషీర్ వయాలిల్‌తో భేటీ అయ్యారు. అబుదాబిలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న బుర్జిల్ సంస్థ, ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపింది.
తిరుపతిలో అత్యాధునిక స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. రీసెర్చ్, ఎడ్యుకేషన్‌పై తమ సంస్థకు ఉన్న విశేష అనుభవాన్ని రాష్ట్రంలో వినియోగిస్తామని బుర్జిల్ ప్రతినిధులు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రివెంటివ్-క్యూరేటీవ్ వైద్య విధానం, హెల్త్ కార్డుల డిజిటలీకరణ వంటి ప్రాజెక్టుల గురించి సీఎం వివరించారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ సహా పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పర్యటన ద్వారా పోర్టులు, వైద్యారోగ్యం వంటి కీలక రంగాల్లో ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు దక్కుతుండటం రాష్ట్ర ప్రగతికి శుభసూచకంగా కూటమి నేతలు చెబుతున్నారు.











