ఒక్కొక్కరికీ ఒక్కో పిచ్చి ఉంటుంది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చే అందరికీ కామన్ గా ఉండే పిచ్చి సినిమా పిచ్చి. అయితే ఆ సినిమా పిచ్చి కూడా కొందరికి పీక్స్ లో ఉంటుంది. చిన్నప్పటి నుంచే సినిమాపై ఉన్న ప్యాషన్ తో దానికి తగ్గట్టు అడుగులు వేస్తూ ఉంటారు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల కూడా ఈ కోవకి చెందిన వారే.
సినిమా బండి అనే మూవీతో రచయితగా, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటూ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు ప్రవీణ్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు ప్రవీణ్ వైజాగ్ లోని గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివారు. ముందు నుంచే సినిమాలపై ఆయనకు ఇంట్రెస్ట్ ఉండటంతో అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి షార్ట్ ఫిల్మ్స్ తీయడం ద్వారా ఆ ఇంట్రెస్ట్ ఇంకాస్త పెరిగింది.
ఈ ఏడాది శుభం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో మంచి హిట్ ను అందుకున్న ప్రవీణ్, ఇప్పుడు పరదా అనే సినిమాను రిలీజ్ కు రెడీ చేశారు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ పరదా సినిమా ఆగస్ట్ 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఓ చిట్ చాట్ లో పాల్గొని డైరెక్టర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను వెల్లడించారు. ప్రవీణ్ ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకోడని, ఎంత టఫ్ సిట్యుయేషన్ లో ఉన్నా ఏముంది అయిపోతుందిలే అంటూ లైట్ తీసుకుంటూ ఉంటాడని, కొన్నిసార్లు అది చూసి తనకు కోపం కూడా వచ్చేదని అనుపమ చెప్పారు.
అదే ఇంటర్వ్యూలో వైవా హర్ష ప్రవీణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు. గీతంలో బీటెక్ చదివిన ప్రవీణ్, ఫైనల్ ఇయర్ 4-2లో ఉన్నప్పుడు బీటెక్ ను డిస్‌కంటిన్యూ చేసి విజిలింగ్ వుడ్స్ కు వెళ్లి సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాడని, వాస్తవానికి అతను బీటెక్ ను డిస్‌కంటిన్యూ చేయాల్సిన పని లేదని, అయినప్పటికీ తాను ఆ పని చేశాడని హర్ష తెలిపారు. అయితే తర్వాత తాను ఆ బీటెక్ ను పూర్తి చేసినట్టు ప్రవీణ్ క్లారిటీ ఇచ్చారు.