తిరువూరు టీడీపీలో పంచాయితీని చక్కదిద్దడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు కత్తిమీద సాములా తయారైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని మధ్య చెలరేగిన వివాదంపై తాడోపేడో తేల్చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిసైడ్ అయినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆయన ఆదేశాలతో ఇద్దరూ పార్టీ క్రమశిక్షణ సంఘం విచారణకు హాజరై తమ వాదనను వినిపించారు. అయితే ఈ విషయంలో ఎవరిది తప్పుందో తేల్చాల్సిన క్రమశిక్షణ సంఘం ఆ పనిచేయలేకపోయిందని అంటున్నారు. అధినేత సూచనలతో ఇద్దరు నేతల నుంచి వివరణ తీసుకున్న క్రమశిక్షణ సంఘం సభ్యులు.. ఆ ఇద్దరు చెప్పిన విషయాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లడానికి మాత్రమే పరిమితమయ్యారని అంటున్నారు.
రాజధాని అమరావతి ఉద్యమం నేపథ్యంతో తెలుగుదేశం పార్టీకి దగ్గరైన దళిత నేత కొలికపూడి శ్రీనివాసరావు.. గత ఎన్నికల్లో తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. వాస్తవానికి తిరువూరు నియోజకవర్గంతో ఈయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా, పార్టీ సూచనలతోనే ఆయన తిరువూరులో పోటీ చేయాల్సివచ్చిందని చెబుతున్నారు. అయితే గెలిచిన రెండో రోజు నుంచి వివాదాస్పద తీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కొలికపూడి.. కొద్దిరోజుల క్రితం ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేయడమే చర్చనీయాంశమైంది.
తన నియోజకవర్గ వ్యవహారాల్లో ఎంపీ చిన్ని తలదూర్చడాన్ని సహించలేని ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్ గా ఎంపీ చిన్ని కూడా రోడ్డెక్కాల్సివచ్చింది. దీంతో పార్టీ పరువు బజారున పడుతుందనే ఆలోచనకు వచ్చిన సీఎం చంద్రబాబు.. ఇద్దరి నుంచి వివరణ తీసుకోవాలని నిర్ణయించారు. ఇద్దరిలో ఎవరో ఒకరిని పార్టీ నుంచి సాగనంపాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరగుతోంది. అయితే ఆ ఇద్దరూ తమకు అధినేత అంటే భక్తి, గౌరవం ఉన్నాయని చెప్పుకోవడంతో ఎవరిపై వేటు వేయాలనేది చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు.
ఎవరిపై వేటు వేసినా ప్రతిపక్షం వైసీపీ చాన్స్ తీసుకునే అవకాశం లేకుండా జాగ్రత్త పడటం చంద్రబాబుకు సవాల్ గా మారిందని అంటున్నారు. ఇద్దరిలో ఎవరిపై చర్య తీసుకున్నా, మరొకరు విపక్షంతో చేతులు కలిపి భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారకూడదనే ఆలోచనతో చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా, రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని పార్టీ నేతలకు గుర్తుచేస్తున్న చంద్రబాబు… తిరువూరు గొడవలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సివుంటుందని వారి సలహాలు కూడా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోడానికి కాస్త సమయం తీసుకోవడమే మంచిదన్న ఆలోచన చంద్రబాబులో కనిపిస్తోందని చెబుతున్నారు.
















