రాజకీయాల్లో అతి విశ్వాసం తగదు, కానీ అత్యాశలు మాత్రం ఉండాలి. ఎందుకంటే ఎంత పెద్ద లక్షయం పెట్టుకుంటే అందులో సగం సాధించినా సక్సెస్ అయినట్లే. వైసీపీ విషయం తీసుకుంటే ఆ పార్టీ లక్ష్యాలు అందరికీ తెలిసిందే. మరోసారి ఏపీలో అధికారం అందుకోవాలని. అయితే దాని కోసం పార్టీ ఎంచుకుంటున్న వ్యూహాల మీదనే చర్చ సాగుతోంది. పార్టీ యాక్షన్ ప్లాన్ అయితే ప్రత్యర్ధుల మాటలలో కానీ విమర్శలలో కానీ చెప్పాలీ అంటే అప్పుడప్పుడు వైసీపీ జగన్ మెరుస్తున్నారుట.
వైసీపీ అధినేత జగన్ ఈ మధ్య కాలంలోనే జనంలోకి వస్తున్నారు. అది కూడా ఇష్యూ బేస్డ్ గానే సాగుతోంది. ఎక్కడైనా ప్రజా సమస్యలు ఉంటే అక్కడికి వెళ్తున్నారు అలా పరామర్శల పేరుతో పర్యటనలు చేస్తున్నారు. గత నెలలో తమ పార్టీ ఇచ్చిన ఆందోళనల కార్యక్రమాల్లో భాగంగా అనకాపల్లి జిల్లా నర్శీపట్నంలోని మాకవరపాలెం లో మెడికల్ కాలేజీని ఆయన సందర్శించారు. ఇపుడు చూస్తే ఆయన క్రిష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగానే ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.
జగన్ వస్తే జనాలు వస్తున్నారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు పార్టీ వారు ఒక వైపు ఉంటారు. స్థానికంగా తమ ప్రాంతానికి వచ్చేటపుడు చూసేందుకు జనాలు ఎటూ ఉంటారు దాంతో జగన్ పర్యటనలు జనంతో బాగానే సాగుతున్నాయి. ఇలా జనం వైసీపీ వెంట ఉన్నారు అన్నది వైసీపీని మురిపిస్తోంది. ఇక దీంతో పాటుగా నెలకో మీడియా మీట్ ని జగన్ నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఏణ్ణర్ధం కాలం అయితే వైసీపీ గడిపేసినట్లు అయింది. మొత్తానికి చూస్తే ఇదేదో బాగానే ఉంది అనిపిస్తోంది అని ఫ్యాన్ పార్టీకి అనిపిస్తోంది కానీ తెలుగుదేశం నేతలు మాత్రం ఇది భ్రమలలో విహరిస్తున్నట్లుగానే ఉంది అని సెటైర్లు పేల్చుతోంది.
వైసీపీ కాదు కానీ ఏ రాజకీయ పార్టీకి అయినా అనేక ఫ్లాట్ ఫారాలు ఉంటాయి. మీడియాతో పాటు జనంలోకి వచ్చి నిర్వహించే సభలు ఆందోళనలు, ప్రజా ప్రతినిధులకు చట్ట సభలు ఇలా ఉంటాయి. వైసీపీ అయితే ఈ వేదికలను ఉపయోగించుకోవడం లేదు అని అంటున్నారు ముఖ్యంగా వైసీపీకి మైలేజ్ రావాలి అన్నా రాజకీయంగా గ్రాఫ్ పెరగాలి అన్నా అసెంబ్లీకి వెళ్ళాల్సి ఉంటుందని మేధావుల నుంచి అంతా సూచిస్తున్నారు అయితే వైసీపీ పెద్దలు మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అని అంటున్నారు. ఇక జనంలోకి విరివిగా వెళ్ళాల్సిన కర్తవ్యం అధికార పక్షం కంటే విపక్షానికే ఎక్కువగా ఉంటుంది. కానీలో రివర్స్ అన్నట్లుగా అధికార పక్షమే ఎక్కువగా జనంతో కనిపిస్తోంది అన్నది కూడా ఉంది.
ఏపీకి అపుడపుడు వచ్చే జగన్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని మంత్రి నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ఒక వేలు మా మీదకు చూపిస్తే నాలుగు వేళ్ళు ఆయన వైపు చూపిస్తున్నాయని తెలుసుకోవాలని అన్నారు. మొంథా తుఫాన్ వేళ సీఎం నుంచి దిగువ స్థాయి ఉద్యోగి వరకూ అంతా రోజంతా పనిచేస్తేనే తుఫాన్ ప్రమాద తీవ్రతను తగ్గించగలిగామని లోకేష్ చెప్పారు. అయితే విపక్ష నేత మాత్రం విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. తాము కష్టపడుతూ ప్రజల కోసం వారి అభివృద్ధి కోసం పాటు పడుతున్నామని నారా లోకేష్ చెప్పారు. ఇలా అపుడపుడు వైసీపీ జనంలోకి వస్తోంది అన్న మాటలు ప్రత్యర్ధి అన్నారని కాదు వైసీపీ కూడా అంతర్మధనం చేసుకోవాల్సి ఉందని అంటున్నారు.


















